పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు..

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగించారు. కరోనా మహమ్మారిపై భారత్‌ పోరాటం స్ఫూర్తిదాయకమని చెప్పారు. ప్రతి భారతీయుడికీ స్వాతంత్ర్య అమృతోత్సవ్‌ శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులకు నివాళులు అర్పిస్తున్నట్లు రాష్ట్రపతి చెప్పారు. సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌ మూల సూత్రంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
బడ్జెట్‌ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. తొలివిడతగా నేటి నుంచి ఫిబ్రవరి 11 వరకు, మలి విడత మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 8 వరకు జరుగుతాయి. రాష్ట్రపతి ప్రసంగం పూర్తయిన తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభ ముందుకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను తీసుకురానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ఆమె తన నాలుగో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.