మార్కెట్‌లో పత్తి ధర రికార్డ్ స్థాయిలో! ..ఇంకా పెరిగే అవకాశం..!

*దుమ్ము రేపే ధర…
*ఇంకా పెరుగుతుంది*

మార్కెట్‌లో పత్తి ధర దుమ్ము రేపుతోంది. క్వింటం పత్తికి రూ.8 వేలకు పైగా పలుకుతోంది. సీజన ప్రారంభంలోనే రికార్డు స్థాయిలో ధర లభిస్తుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
ఈ ధర గతంలో ఎప్పుడూ లేదని, క్వింటం నాలుగైదు వేలకు మించలేదని రైతులు అంటున్నారు. ఈసారి సాగు విస్తీర్ణం తగ్గి, మార్కెట్‌కు పత్తి తక్కువగా వస్తోంది. ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా పత్తికి డిమాండ్‌ పెరిగింది. దీం తో ధర రికార్డు స్థాయిలో లభిస్తోందని వ్యాపారులు అంటున్నారు. మూడేళ్లుగా పత్తి బఫర్‌ స్టాక్‌ తగ్గడంతో పాటు, చైనా, పాకిస్తాన, బంగ్లాదేశలలో పత్తి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ నుంచి మన దేశ పత్తికి ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

లాక్ డౌన్ తరువాత పరిశ్రమలన్నీ తెరిచినందుకే..

కొవిడ్‌ కారణంగా గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా టెక్స్‌టైల్స్‌ పరిశ్రమలన్నీ మూతబడ్డాయి. ఇవన్నీ క్రమక్రమంగా తెరుచుకున్నాయి. దీంతో ప్రధాన ముడిసరుకైన పత్తికి భారీగా డిమాండ్‌ పెరిగింది. బంగ్లాదేశ, చైనా, అమెరికాతో పాటు యూరోపియన మార్కెట్‌లో పత్తి అవసరాలు పెరిగాయి. ప్రపంచ దేశాల నుంచి మన దేశంలో ఉత్పత్తి అవుతున్న పత్తిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జిన్నింగ్‌ మిల్లులు, మార్కెట్‌ యార్డులకు ప్రస్తుతం పత్తి తక్కువగా వస్తోంది. ఇవన్నీ రైతులకు కలిసొచ్చాయి. మద్దతు ధర కన్నా రూ.1000 నుంచి రూ.2 వేలకు పైగా ధర లభిస్తోంది. దీంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు..

పత్తికి పెరిగిన డిమాండ్‌ నేపథ్యంలో కొనుగోలుకు మిల్లర్లు, వ్యాపారులు నేరుగా రంగంలోకి దిగారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి నేరుగా పత్తిని కొంటున్నారు. వారం రోజులుగా ఆదోని మార్కెట్‌యార్డులో క్వింటం పత్తికి రూ.8 వేలకు పైగానే ధర లభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గత శనివారం 2 వేల క్వింటాళ్ల పత్తి మార్కెట్‌కు వచ్చింది. కనీస ధర రూ.7 వేలు, మోడల్‌ ధర రూ.7,500 నుంచి రూ.8 వేలు పలికింది. ఆదోనితో పాటు నంద్యాల తదితర చోట్ల పత్తిని వ్యాపారులు, మిల్లర్లు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్నారు. ధర ఇదే విధంగా కొనసాగితే ఈ ఏడాది పత్తి సాగు చేసిన రైతుల పంట పండినట్లే అంటున్నారు. గత సంవత్సరం జిల్లాలో 2.70 లక్షల హెక్టార్లలో పత్తి పంటను సాగు చేశారు. భారీ వర్షాల వల్ల పంట దిగుబడి పూర్తిగా తగ్గింది. రంగు మారడం వల్ల ధర కూడా తగ్గిపోయింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం జిల్లాలో పత్తి సాగు రూ.2.50 లక్షల హెక్టార్లకు పరిమితమైంది. తెగుళ్లు, వర్షాభావం వల్ల దిగుబడి 50 శాతానికి పడిపోయినా, ధర ఎక్కువగా ఉండటంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా పెరిగే అవకాశం…
ఈసారి అంతర్జాతీయంగా పత్తికి మంచి డిమాండ్‌ ఉంది. జిల్లాలో రైతులు సాగు చేసిన పత్తికి గరిష్ఠ ధర అందుతోంది. క్వింటం రూ.8 వేలకు పైగా పలుకుతోంది. వర్షాభావం, తెగుళ్లు కారణంగా దిగుబడి కొంత తగ్గినా, ధర భారీగా అందుతుండటం రైతులకు పెద్ద ఊరట. గత సంవత్సరం రూ.5 వేల వరకే ధర పలికింది. ఈసారి ఆ పరిస్థితి లేదు. ధర ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. డిసెంబరు దాకా ధరలు తగ్గే సూచనలు లేవు. టెక్స్‌టైల్‌ ఇండస్ర్టీలు పెరగడమే దీనికి కారణం. ప్రపంచ వ్యాప్తంగా పత్తి ఫబర్‌ స్టాకు లేకపోవడం వల్ల డిమాండ్‌ పెరిగింది. న్యూయార్క్‌ మార్కెట్‌లో కాటన ట్రేడింగ్‌ ఎక్కువగా జరుగుతోంది.