Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ …

రాంచరణ్, జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు, ఉపేంద్ర లిమయే, కృతిశెట్టి, జాన్ విజయ్, చమ్మక్ చంద్ర, దయానంద్ రెడ్డి, శృతిహాసన్, రవికిషన్ తదితరులు..

దర్శకత్వం: బుచ్చిబాబు సనా

నిర్మాత: వెంకట సతీష్ కిలారు

ప్రొడక్షన్ డిజైనర్‌: కోల్లా అవినాష్

సంగీతం: ఏఆర్ రెహ్మాన్

సినిమాటోగ్రఫి: ఆర్ రత్నవేలు

ఎడిటింగ్: నవీన్ నూలి, ఆంటోని రుబెన్

క్యాస్టూమ్ డిజైనర్: దీపాలీ నూర్

స్టంట్స్: సుప్రీం సుందర్

ఆర్ట్: డేవిడ్ కుమార్ బపన్నపల్లి

బ్యానర్: వృద్ధి సినిమాస్

రిలీజ్ డేట్: 2026-06-03

విజయనగరం జిల్లాలో ప్రపంచానికి దూరంగా ఉండే మారుమూల పల్లెలో బెల్లం తయారీ కంపెనీలో కూలీ పెద్ది (రాంచరణ్). ఆ ప్రాంతంలో ఉన్నత వర్గాలు చూపించే ఆర్థిక, సామాజిక వివక్షను ఎదుర్కొంటుంటాడు. ఆ బాధ కంటే తన ఊరికి, అక్కడ నివసించే ప్రజలకు గుర్తింపు లేకపోవడం ఇంకా బాధిస్తుంటుంది. ఆ ప్రాంతంలో ధనికులు ఆడే క్రికెట్ ఆట పందెంలో ఆట కూలీగా పెద్ది క్రికెటర్‌గా తనకంటే సాటిలేని క్రీడాకారుడిగా గుర్తింపు పొందుతాడు. అయితే తన గ్రామానికి చెందిన అప్పలసూరి (జగపతిబాబు) తన ఊరికి మేలు చేసే ఓ పని కోసం జీవితాన్ని పణంగా పెట్టి పోరాటం చేస్తుంటాడు. అప్పల సూరికి జరిగిన అన్యాయం పెద్ది జీవితాన్ని పెద్ద మలుపు తిప్పుతుంది. క్రికెట్ ఆటను వదిలిపెట్టి కోడి రామ్మూర్తి నాయుడు శిష్యుడు గౌరీనాయుడు (శివరాజ్ కుమార్) వద్ద కుస్తీ విద్యను నేర్చుకొంటాడు. అయితే విధి వక్రీకరించడంతో కుస్తీ విద్యను వదిలేసి అథ్లెట్‌గా మారుతాడు.

బెల్లం కంపెనీలో పెద్ది ఎలాంటి వివక్షను ఎదుర్కొంటాడు? గ్రామం కోసం అప్పలసూరి చేసే పోరాటం ఏమిటి? పెద్ది క్రికెట్ జీవితం ఎలా గడించింది? విజయనగరంలో రాంబూజీ (దివ్యేందు)తో వైరం ఏంటిది? అప్పలసూరి త్యాగం పెద్ది జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? కుస్తీ యోధుడు గౌరీ నాయుడు వద్ద కుస్తీ క్రీడను ఎందుకు నేర్చుకొంటాడు? జాతీయ స్థాయిలో బంగారు పతకం గెలిచే వరకు వెళ్లిన పెద్ది అథ్లెట్‌గా ఎందుకు మారాడు? అప్పలసూరి జీవితాశయాన్ని పెద్ది ఎలా సాధించాడు? అనే ప్రశ్నలకు సమాధానమే పెద్ది సినిమా కథ.

130 కోట్ల జనాభా ఉన్న భారత్ ఒలంపిక్ క్రీడలో రెండు పతాకాలు సాధించడంపై అసంతృప్తిని వెళ్లగక్కే కేంద్ర మంత్రి సన్నివేశంతో ఆలోచింపచేసే విధంగా, భావోద్వేగాల మధ్య విజయనగరంలో క్రీడాకారులు ఎంపిక మొదలవుతుంది. క్రీడా సంఘం అధికారి (బోమన్ ఇరాని) విజయనగరం రావడంతో పెద్ది ఘనత ఆయన దృష్టికి వస్తుంది. పెద్ది లైఫ్ చెప్పే ఫ్లాష్ బ్యాక్‌ కథలోకి దర్శకుడు తీసుకెళ్లిన విధానం బాగుంది. ఫస్టాఫ్ స్క్రీన్ ప్లే రొటీన్, రెగ్యులర్‌గా, కమర్షియల్ అంశాలు లెక్కలేసుకొని సినిమాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. పాత్రల పరిచయం జాన్వీ కపూర్ అందచందాలతో మొదటి భాగంలో సగం కథను మమా అనిపించేశాడు. అప్పలసూరికి సంబంధించి ఓ ఎమోషనల్ సీన్‌తో ఇంటర్వెల్ ఎపిసోడ్ ప్రేక్షకుడిని భావోద్వేగాల ఊగిసలాటకు గురి చేస్తుంది. ఫస్టాఫ్‌ను ఇంకా బెటర్‌గా ఎమోషనల్ కనెక్టవిటీ చేసే విధంగా కథను చెప్పి ఉంటే ఇంకా బెటర్‌గా ఉండేదనిపిస్తుంది.

ఇంటర్వెల్ బ్యాంగ్‌తో కథను మలుపు తిప్పిన దర్శకుడు బుచ్చిబాబు.. పెద్ది పాత్రను చెక్కిన విధానం.. ఆ పాత్రలో రాంచరణ్ చూపించిన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురి చేస్తాయి. సెకండాఫ్‌లో పెద్ది, గౌరినాయుడు పాత్రల మధ్య కెమిస్ట్రీ బాగా పండటం, చివరి 30 నిమిషాలు కథను, సన్నివేశాలను డీల్ చేసిన విధానం సినిమాకు హైలెట్‌గా అనిపిస్తుంది. దేశ పటంలో గుర్తింపులేని ఊరికి ఓ పేరు పెట్టడం, ఆ ఊరి అడ్రస్‌, పిన్ కోడ్‌తో తొలి ఉత్తరం పెద్దికి రావడం చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే అంశాలుగా కనిపిస్తాయి.

పెద్దిగా రాంచరణ్ తప్ప మరొకరు చేయలేరు అనే విధంగా మెగా పవర్ స్టార్ తన నటనా విశ్వరూపం చూపించారు. యాక్టింగ్‌లో తండ్రిని మించిన తనయుడు అనేలా నటించాడు. దేశంలోనే కమర్షియల్ స్టార్‌గా ఇమేజ్ ఉన్న చెర్రీ పెద్ది కథను ఒప్పుకోవడం, ఆ పాత్రలో జీవించి సినిమాను తన భుజాల మీద మోయడం గ్రేట్ అనిచెప్పాలి. ఫస్టాఫ్‌లో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో, సెకండాఫ్‌లో ఎమోషనల్ అంశాలతో తనకు తానే సాటి అని నిరూపించుకొన్నాడు. అవార్డు లెవెల్ పెర్ఫార్మెన్స్‌తో కేక పెట్టించాడు. జాన్వీ కపూర్‌కు గ్లామర్ పాత్రకే పరిమితమైంది. చివర్లలో అవకాశం దక్కిన ఓ సీన్‌తో ఆకట్టుకొన్నది. ఈ సినిమాకు జగపతి బాబు మరో ప్రధాన అస్త్రంగా మారాడు. ఇప్పటి వరకు ఎన్నడూ చూడని విధంగా పెర్ఫార్మెన్స్ చేశారు. శివరాజ్ కుమార్ అద్బుతమైన పాత్రలో ఒదిగిపోయాడు. దివ్యెందు, ఉపేంద్ర లిమియే, ఇంకా అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమాను ఓ రేంజ్‌లో నిలబెట్టిన వారిలో ఏఆర్ రెహ్మన్ ముందు ఉంటాడు. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఒక్కో సీన్‌ను ఎలివేట్ చేసిన విధానం హైలెట్. ఇక ఆర్ట్ విభాగం, క్యాస్టూమ్ డిజైనర్ పనితీరు ది బెస్ట్. కథలోకి తీసుకెళ్లే విధంగా వారు సృష్టించిన వాతావరణం చాలా బాగుంది. ఇక రత్నవేల్ సినిమాటోగ్రఫి ప్రతీ ఫ్రేమ్‌ను రిచ్‌గా, పెయింటింగ్‌గా మార్చింది. ఈ సినిమాకు ఎడిటర్లు పనిచేసిన తీరు చూస్తే కత్తిమీద సాములాంటి పనిని చక్కగా నిర్వర్తించారు. నిర్మాత కిలారు సతీష్ సినిమాపై ఉన్న అభురుచి ఏమిటో ఈ సినిమాను చూస్తే తెలుస్తుంది. రాజీలేని, ఖర్చుకు వెనుకాడకుండా నిర్మాణ విలువలను అద్బుతంగా పాటించారు.

పెద్ది.. ఓ కామన్ మ్యాన్ బయోపిక్‌లాంటి సినిమా. మారుమూల గ్రామం నుంచి జాతీయస్థాయికి ఎదిగిన క్రీడాకారుడి జీవితాన్ని బుచ్చిబాబు అద్బుతంగా చూపించే ప్రయత్నం చేశారు. లార్జర్ ద్యాన్ లైఫ్ క్యారెక్టర్, సినిమాలో ఇంకా బెటర్‌గా ఎమోషన్స్ జొప్పించి ఉంటే సినిమాకు తిరుగు ఉండేది కాదు. భారతీయ సినిమా పరిశ్రమలో ది బెస్ట్ స్పోర్ట్స్ డ్రామా అయి ఉండేది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సంచలనం రేపిన క్రీడాకారుడి గురించి క్రీడా అధికారికి తెలియకపోవడం అతిశయోక్తి, నమ్మశక్యంగా ఉండదు. రన్ టైమ్ కారణంగా కొన్ని సన్నివేశాలు అర్ధాంతరంగా ముగిశాయా? కనెక్టవిటీ ఏదో మిస్ అయినట్టు అనిపిస్తాయి. ఇలాంటి స్వల్ప లోపాలు పక్కన పెట్టే విధంగా రాంచరణ్ మాత్రం నభూతో నభవిష్యత్ అనే విధంగా పెద్దిగా నటించాడు.

సినిమా ఏ స్థాయిలో ఉందో ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో మీకు వేచి చూడాలి మరి.. ప్రస్తుతానికైతే సినిమాపై మంచి టాక్ తో నడుస్తోంది.