దేశంలో భగ్గుమంటున్నా పెట్రోల్‌, డీజిల్ ధరలు …..

దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. పెట్రోల్‌ పంపులకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. గత రెండువారాలుగా ధరలను పెంచుతూ వస్తున్న చమురు కంపెనీలు.. తాజాగా మంగళవారం లీటర్‌ పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.104.61, డీజిల్‌ రూ.95.87కు చేరింది. ముంబైలో పెట్రోల్‌ రూ.119.67, డీజిల్‌ రూ.103.92కి చేరింది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.118.59, డీజిల్‌ రూ.104.62కి పెరిగింది…. మార్చి 22 తర్వాత ఒకటి రెండు రోజులు మినగా వరుసగా ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి. గత 15 రోజుల్లో ధరలు పెరగడం ఇది 13వ సారి. ఇప్పటి వరకు లీటర్‌ పెట్రోల్, డీజిల్‌పై దాదాపు రూ.11 వరకు పెరిగింది. భారీగా ఇంధన ధరల పెరుగుతుండడంతో సామాన్యులు పెట్రోల్‌ బంకులకు వెళ్లాలంటే వణికిపోతున్నారు. ఇదిలా ఉండగా.. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 3.12 డాలర్లు పెరిగి బ్యారెల్‌కు 107.52 డాలర్లకు చేరుకుంది. అదేవిధంగా డబ్ల్యూటీఐ క్రూడ్ కూడా బ్యారెల్‌కు 4.03 డాలర్లు పెరిగి 103.30 డాలర్లకు చేరింది…