రష్యా–ఉక్రెయిన్ యుద్ధం పెట్రో ధరలు పెరగొచ్చని ప్రచారం.. ప్రస్తుతం అలాంటి టెన్షన్ అవసరం లేదు.

రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో చమురు ధరలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని, స్థిరమైన ధరలకే సప్లయ్ జరిగేలా చూస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం వ్యూహాత్మక నిల్వల నుంచి పెట్రోల్, డీజిల్ ను విడుదల చేస్తున్నామని, ఫలితంగా ధరల సమస్య ఉండబోదని భరోసా ఇచ్చింది. రష్యా దాడుల తర్వాత గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ధరలు బ్యారెల్ కు 100 డాలర్లకుపైగా పెరిగాయి. ప్రస్తుత ధరలు 93 డాలర్ల వద్ద ఉన్నాయి. యుద్ధం వల్ల చమురు సప్లయ్కి ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉందని, ఫలితంగా పెట్రో ధరలు పెరగొచ్చని ప్రచారం జరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, జనానికి సరైన ధరలకే పెట్రోల్, డీజిల్ దొరికేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఆందోళన అవసరం లేదని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దేశంలో గత 113 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి. దీపావళి సమయంలో పెట్రోల్, డీజిల్పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. కేంద్రం సూచనల మేరకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ను తగ్గించాయి.