అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంతో భారతదేశ వ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్కు కొరత ఏర్పడింది. కొన్ని రోజులుగా ప్రజలు వంట గ్యాస్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా పెట్రోల్ నిల్వలు కూడా దేశంలో తగ్గిపోయాయన్న ప్రచారంతో బంకుల ముందు వాహనదారులు క్యూ కడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. క్యూ కట్టి మరీ బంకుల నుంచి పెద్దఎత్తున ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారు….
హెచ్పీసీఎల్(HPCL), ఐఓసీఎల్ (IOCL), బీపీసీఎల్ (BPCL) కంపెనీల వద్ద సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని అసోసియేషన్ ధృవీకరించింది. రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందుబాటులో ఉందని, ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది. విపరీతమైన రద్దీ కారణంగా కొన్ని బంకుల్లో తాత్కాలికంగా ఇంధన కొరత ఏర్పడిందని, దీనిని ఇంధన కొరతగా భావించవద్దని అసోసియేషన్ తెలిపింది. వినియోగదారులు పుకార్లను నమ్మవద్దని, ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేసింది. ఇంధనం దొరకదన్న భయంతో బంకుల వద్దకు క్యూ కడుతున్నారని, నిల్వలు ఉంచుకునేందుకు ముందస్తు కొనుగోళ్లతో ఇబ్బంది ఏర్పడుతోందని అసోసియేషన్ తెలిపింది.
ఆందోళన వద్దు..
హైదరాబాద్లోనూ అవసరం లేకున్నా లీటర్ల కొద్దీ పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు వాహనదారులు. దీంతో పలు బంకులు తాత్కాలికంగా మూతపడ్డాయి. నగర వ్యాప్తంగా చాలా బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించడంతో ప్రజలు మరింతగా ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్ కొరతతో ఇబ్బందులు తప్పవన్న వదంతులే ఇందుకు కారణం. అయితే, దీనిపై తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది…
కిలోమీటర్ల మేర వాహనాలు పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టాయి. ఆటోలు, కార్లు, కంటైనర్లు కూడా పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి నిరీక్షిస్తున్నాయి. ఎవరి నోట చూసిన ఫుల్ ట్యాంక్ మాటే వినిపిస్తుండటంతో.. బంకుల్లో నిల్వ ఉన్న పెట్రోల్, డీజిల్ ఖాళీ అవుతుంది. మళ్లీ వాటిని నింపేందుకు సమయం పడుతుండటం వల్లే నో స్టాక్ బోర్డులు పెట్టాల్సి వస్తోందని, తీవ్రమైన కొరత ఉందన్నది అవాస్తవమని బంకుల యజమాన్యాలు కూడా చెప్తున్నాయి. ఇంధన కొరత లేదని ఎంతచెప్తున్నా వాహనదారులు వినడం లేదని వాపోతున్నాయి.