ట్యాపింగ్‌పై ఉన్నతస్థాయి దర్యాప్తుతోపాటు న్యాయ విచారణ చేయాలి …కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి..

భారాస ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌పై ఉన్నతస్థాయి దర్యాప్తుతోపాటు న్యాయ విచారణ చేయాలని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ట్యాపింగ్‌ వ్యవహారాలకు అప్పటి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలన్నారు. నాటి సీఎం, డీజీపీ, రిటైర్డ్‌ అధికారులు ఏ రకంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారనే అంశంపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. మంగళవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ”భాజపా నాయకులు, ఆఫీసు సిబ్బంది ఫోన్లను ట్యాప్‌ చేసిన ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజకీయ నాయకులవే కాకుండా అధికారులు, వ్యాపారుల ఫోన్లనూ ట్యాప్‌ చేసి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించారు. కొంతమంది పోలీసు అధికారులు మాఫియాగా ఏర్పడి వసూళ్ల కోసం ఇలా చేయడం దుర్మార్గం. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బ్యాంకు నుంచి పార్టీ డబ్బు డ్రా చేసుకుని వస్తుంటే ట్యాపింగ్‌ ద్వారా వివరాలు తెలుసుకుని భాజపా కార్యాలయ సిబ్బందిని చుట్టుముట్టి పట్టుకున్నారు.. చివరకు తప్పు తెలుసుకున్నారు…భాజపా కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఎమ్మెల్సీ కవితను అక్రమ కేసులో అరెస్ట్‌ చేశారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ మాట్లాడడం విడ్డూరం. దిల్లీలో మద్యం వ్యాపారంలో కవిత పాత్ర ఉందా? లేదా? కొంతమంది వ్యక్తులతో వ్యాపార సంస్థను ఏర్పాటు చేసి అందులో తన బినామీ మనుషులను పెట్టారా? లేదా? దిల్లీలో ఆప్‌ ప్రభుత్వంతో మంతనాలు జరిపారా? లేదా? కోట్లాది రూపాయలు చేతులు మారాయా లేదా? అనే విషయాలపై మాజీ సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాలి. కవిత అరెస్టుకు రాష్ట్ర రాజకీయాలకు, ప్రజలకు, తెలంగాణ సెంటిమెంటుకు ఏ మాత్రం సంబంధంలేదు. ఇది కక్షసాధింపు కేసు అయితే మాజీ సీఎం కేసీఆర్‌ బహిరంగ చర్చకు రావాలి. భాజపాను విమర్శిస్తే సహించేది లేదు.. ఆ కుటుంబం అవినీతిని ప్రజల ముందుంచుతాం. బెయిల్‌ కూడా నిరాకరించిన మద్యం కేసులో కవిత కడిగిన ముత్యంలా ఎలా బయటకు వస్తారో తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. హైదరాబాద్‌ చెంగిచర్ల కబేళా వద్ద రెండు రోజుల క్రితం గిరిజన మహిళలపై ఒక వర్గం దాడి చేసి 30 మందిని తీవ్రంగా గాయపరిచినా హత్యాయత్నం కేసులు నమోదు చేయలేదు.. ఒక్కర్నీ అరెస్ట్‌ చేయలేదు. ఈ వ్యవహారంపై ఇప్పటికే జాతీయ ఎస్టీ కమిషన్‌, జాతీయ మహిళా కమిషన్‌కు పిర్యాదు చేశాం. చెంగిచర్ల కబేళా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోంది. దీన్ని వెంటనే మూసివేయాలి” అని డిమాండ్‌ చేశారు..