బాలికపై కారులో గ్యాంగ్ రేప్ చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి… పవన్ కళ్యాణ్.

హైదరాబాదులో కొందరు మైనర్ బాలురు ఓ మైనర్ బాలికపై కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడడం పట్ల జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఘటన దుర్మార్గమని, తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. అల్లారుముద్దుగా పెంచుకునే పిల్లలను ఎవరన్నా ఒక దెబ్బ కొడితే విలవిల్లాడే తల్లిదండ్రులు, తమ బిడ్డపై సామూహిక అత్యాచారం జరిగితే ఎంత క్షోభకు గురవుతారో ఊహించగలను అంటూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘోర స్థితి పగవారికి కూడా రాకూడదని భారతీయులు కోరుకుంటారని వెల్లడించారు. అమ్మాయిలపై అత్యాచారాలు నిరోధించాలంటే, ఇప్పుడున్న శిక్షలే కాకుండా, మృగాళ్లకు అత్యాచారాల ఆలోచనలే రాకుండా ఉండేలా కఠినంగా వ్యవహరించాలి, అలాంటి అవసరం ఉందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ కేసులో నిందితులు ఎవరైనా సరే చట్టం ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. బాధిత బాలిక, ఆమె కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా నిలవాలని పేర్కొన్నారు.