మీ భవిష్యత్ కోసం నన్ను నమ్మండి: .. పవన్…

*విజయనగరం.. రాజధాని పేరిట ఉత్తరాంధ్ర ప్రజల్ని వైకాపా నేతలు మోసం చేస్తున్నారని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. బంగారు భవిష్యత్‌ కోసం జనసేనను నమ్మాలని పిలుపునిచ్చారు.విజయనగరం జిల్లా గుంకలాంలో నిర్మిస్తున్న జగనన్న కాలనీని ఆయన పరిశీలించారు. అనంతరం స్థానికులను ఉద్దేశించి పవన్‌ మాట్లాడారు. ”వైకాపా ప్రభుత్వ మోసాన్ని ప్రజలు గ్రహించాలి. ఉత్తరాంధ్ర ప్రజలకు బలమైన రాజకీయ అధికారం దక్కాలి. జనసేనకు ఒక్క అవకాశం ఇస్తే మార్పు అంటే ఏంటో చూపిస్తాం.
యువత తన శక్తిని అవినీతి నిర్మూలనకు వినియోగించాలి. మీ భవిష్యత్‌ కోసం నన్ను నమ్మండి. నాపై నమ్మకం ఉంచితే గూండాలతో పోరాడేందుకు నేను సిద్ధం. మత్స్యకారులు ఉపాధి కోసం గోవా, ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. జనసేన అధికారంలోకి వస్తే ఇక్కడే జెట్టీలు నిర్మించి వారి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం. మత్స్యకారులకు హాని కలిగించే దేనినైనా జనసేన అడ్డుకుంటుంది. అవినీతిపై రాజీలేని పోరాటం చేద్దాం. అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసుకొద్దాం. ఉత్తరాంధ్ర జనసైనికులు ధైర్యంగా పోరాడండి. బలంగా ఎదుర్కోండి. కేసులు పెడితే మీతో పాటు నేనూ వస్తా. అవినీతి కోటల్ని బద్దలు కొడదాం” అని పవన్‌ అన్నారు.