అన్ని అంశాల‌పై రైతుల‌తో చ‌ర్చించేందుకు త‌మ ప్ర‌భుత్వం సిద్ధం…… ప్ర‌ధాని మోదీ ..

రైతు ఆందోళ‌న‌ల‌పై ప్ర‌ధాని న‌రేంద్ర స్పందించిన‌ట్లు తెలుస్తోంది. బ‌డ్జెట్ స‌మావేశాల నేప‌థ్యంలో ఇవాళ అఖిల ప‌క్ష భేటీ జ‌రిగింది. ఆ మీటింగ్‌లో పాల్గొన్న మోదీ.. రైతు నిర‌స‌న‌ల గురించి మాట్లాడారు. వివాదాస్ప‌ద‌మైన మూడు కొత్త సాగు చ‌ట్టాల‌ను 18 నెల‌ల పాటు స‌స్పెండ్ చేసే అంశం ఇంకా స‌జీవంగానే ఉన్న‌ట్లు మోదీ వెల్ల‌డించారు. అన్ని అంశాల‌పై రైతుల‌తో చ‌ర్చించేందుకు త‌మ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని ప్ర‌ధాని తెలిపారు. కొత్త సాగు చ‌ట్టాల‌ను 18 నెల‌ల పాటు తాత్కాలికంగా ర‌ద్దు చేయ‌డానికి అంగీక‌రించ‌డం లేద‌ని, ఆ చ‌ట్టాల‌ను పూర్తిగా ర‌ద్దు చేయాల‌ని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్న‌ విష‌యం తెలిసిందే. అయితే ఇవాళ అఖిలప‌క్ష స‌మావేశంలో ప్ర‌ధాని మాట్లాడిన అంశాల‌ను కేంద్ర మంత్రి ప్ర‌హ్లాద్ జోషి ఆ త‌ర్వాత‌ మీడియాతో వెల్ల‌డించారు. కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్‌తో రైతులు చ‌ర్చించార‌ని, అయితే కొత్త చ‌ట్టాల స‌స్పెన్ష‌న్‌పై ఎటువంటి ఒప్పందం జ‌ర‌గ‌లేద‌ని, కానీ రైతుల‌తో ఆ ప్ర‌తిపాద‌న చేసిన‌ట్లు మంత్రి త‌నతో చెప్పార‌ని అఖిల ప‌క్ష భేటీలో ప్ర‌ధాని వెల్ల‌డించారు. సాగు చ‌ట్టాల స‌స్పెన్ష‌న్ అంశంపై చ‌ర్చించేందుకు మంత్రి తోమ‌ర్ ఎల్ల‌వేళ‌లా ఫోన్‌లో సిద్ధంగా ఉంటాన‌ని రైతుల‌తో చెప్పిన‌ట్లు మోదీ గుర్తు చేశారు. రైతు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు త‌మ ప్ర‌భుత్వం నిత్యం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ వెల్ల‌డించిన‌ట్లు మంత్రి ప్ర‌హ్లాద్ చెప్పారు. సాధార‌ణంగా పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు ముందు అఖిల ప‌క్ష భేటీ ఉంటుంది. కానీ ఈసారి స‌మావేశాలు ప్రారంభ‌మైన త‌ర్వాత అఖిల ప‌క్ష భేటీ నిర్వ‌హించారు. శుక్ర‌వార‌మే బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. అయితే రైతు చ‌ట్టాల‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో లోక్‌స‌భ సోమ‌వారానికి వాయిదా ప‌డింది. అయితే రైతులు జాతీయ జెండాను అవ‌మానించిన‌ట్లు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ త‌న ప్ర‌సంగంలో పేర్కొన్న విష‌యం తెలిసిందే…