కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో ఏ ఒక్క రైతుకూ నష్టం జరగదు… ప్రధాని నరేంద్ర మోదీ.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో ఏ ఒక్క రైతుకూ నష్టం జరగదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ సాగు చట్టాలతో దేశంలో ఎక్కడైనా వ్యవసాయ మార్కెట్లు మూతబడ్డాయా? సాగు చట్టాల వల్ల రైతులకు ఎక్కడైనా మద్దతు ధర దక్కలేదా? అని ప్రశ్నించారు. సభలో కావాలనే కొందరు తన ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయనే తనను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కొత్త సాగు చట్టాలతో ఒక్క రైతుకూ నష్టం జరగదన్నారు. రైతులకు నష్టం కలిగించే చట్టాలు ఎందుకు చేస్తాం? సాగు చట్టాలపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని ప్రసంగించారు.

*ప్రపంచానికి ఆశాకిరణంలా ‘భారత్‌’*

కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచానికే భారత్‌ ఓ ఆశాకిరణంలా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ దేశాల్లో మన దేశానికి ప్రాధాన్యం బాగా పెరిగిందని చెప్పారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని ప్రసంగించారు. ‘‘మన దేశం వైవిధ్యానికి మారుపేరు. వైవిధ్యంలోనూ మనం ఏకతాటిపై నడుస్తున్నాం. కరోనా వేళ ప్రపంచ దేశాలకు మనం ఓ దిక్సూచిగా మారాం. ప్రపంచ ప్రజలంతా బాగుండాలని కోరుకొనే దేశం మనది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శాంతికి ప్రాధాన్యత పెరిగింది. శాంతి చర్చల మధ్యే కొన్ని దేశాలు సైనిక శక్తి పెంచుకున్నాయి’’ అన్నారు.

*అందుకే ఆత్మనిర్భర భారత్‌ నినాదం*

‘‘ప్రపంచంలో గొప్ప శక్తిగా ఎదిగిందుకు భారత్‌ కృషిచేస్తోంది. ఆ దిశగా వెళ్లేందుకు ఆత్మనిర్భర్‌ భారత్‌ నినాదం తీసుకొచ్చాం. ఫార్మా రంగంలో మనం ఇప్పటికే ఆత్మనిర్భర్‌ సాధించాం. భారత్‌ నలుమూలలా స్థానికత నినాదం పెరిగింది. ఆత్మనిర్భర్‌ భారత్‌ దిశగా వస్తువులు గ్రామాల్లోనే తయారుకావాలి.

*వారు దేవుడిలా వచ్చారు..!*

కరోనా సమయంలో కనిపించని శత్రువుతో ప్రపంచం పోరాటం చేసింది. 130 కోట్ల ప్రజల సంకల్ప శక్తితో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం. దేవుడి దయవల్ల కరోనా కష్టాల నుంచి మనం బయటపడ్డాం. దేవుడి రూపంలో వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు వచ్చారు. కరోనాతో పోరులో దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. లాక్‌డౌన్‌‌, కర్ఫ్యూల వల్ల అనేక ఆర్థిక కష్టాలు వచ్చాయి. ఆ సమయంలో 75 కోట్ల మందికి ఎనిమిది నెలల పాటు రేషన్‌ సరకులు ఇచ్చాం. ఆధార్‌, జన్‌ధన్‌ ఖాతాల వల్ల కోట్ల మందికి ప్రయోజనం కలిగింది’’ అని మోదీ వివరించారు.

*రైతులకు గిట్టుబాటు ధర దక్కాల్సిందే..*

మా ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి అనేక సంస్కరణలు చేపట్టాం. ఉత్పత్తి రంగానికి ప్రాధాన్యత ఇచ్చాం. రెండంకెల వృద్ధిరేటు సాధిస్తామని నిపుణులు చెబుతున్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టాం. రైతులకు కనీస మద్దతు ధర అందించేందుకు కృషిచేస్తున్నాం. రైతుల ఆదాయం పెరిగేందుకు అనేక కార్యక్రమాలు తెచ్చాం. రైతులకు మద్దతు ధర దక్కాలని మేమంతా కోరుకుంటున్నాం. ఆరుగాలం కష్టపడే రైతులకు గిట్టుబాటు ధర దక్కాల్సిందే.

*కాలం చెల్లిన చట్టాలతో ముందుకెళ్లడం కష్టం*

ఇప్పటికే ఉన్న వ్యవసాయ మార్కెట్లపై ఎలాంటి ఆంక్షలు లేవు. దేశ ప్రగతికి కొత్త సాగు చట్టాలు అవసరం. సమాజంలో మార్పు కోసం మరిన్ని కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది. కాలం చెల్లిన చట్టాలతో దేశం ముందుకెళ్లడం కష్టం. కాంగ్రెస్‌ పార్టీ.. లోక్‌సభలో ఒకలా.. రాజ్యసభలో మరోలా ప్రవర్తిస్తోంది. ఈ చట్టాలపై కాంగ్రెస్‌ నేతలు గందరగోళంలో ఉన్నారు. సమాజంలో మార్పు కోసం, ప్రగతికోసం ఎందరో కృషిచేశారు. ఇంత వైవిధ్య దేశంలో ఏ నిర్ణయానికైనా వందశాతం ఆమోదం రాదు. ఎక్కువ మంది ప్రజలకు లబ్ధి కలిగించే నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వాలు నడవాలి. స్వచ్ఛ భారత్‌, జన్‌ధన్‌ ఖాతాలు కావాలని ప్రజలెవరూ అడగలేదు. ఇవాళ ఎంతోమంది ఆ పథకాలను ప్రశంసిస్తున్నారు. యాచించే స్థాయి నుంచి ఆత్మగౌరవంతో బతికేలా మారుస్తున్నాం. దేశంలో ఎలాంటి మార్పులు రాకూడదని కొందరు కోరుకుంటారు. ’’ అని మోదీ వ్యాఖ్యానించారు.