ఒమిక్రాన్ కేసులు.300 నమోదుతో… ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష..

దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళలో నమోదైన కేసులతో 300 మార్కుని దాటేశాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఒమిక్రాన్‌, కొవిడ్‌తో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతాధికారులతో సమీక్షించారు. కేంద్ర హోంశాఖ, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, పలువురు నిపుణులు హాజరైన ఈ సమావేశంలో ఒమిక్రాన్‌తో పాటు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పైనా ప్రధాని చర్చిస్తున్నట్టు సమాచారం.మరోవైపు ఈ ఒక్కరోజే తమిళనాడులో అత్యధికంగా 33 ఒమిక్రాన్‌ కేసులు రాగా.. మహారాష్ట్రలో 23 వచ్చాయి. ఈ మహమ్మారి బారిన పడిన వారిలో 104 మంది వరకు కోలుకున్నట్టు ఉదయం కేంద్రం విడుదల చేసిన గణాంకాల్లో పేర్కొంది. ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి అప్రమత్తం చేస్తూ మార్గదర్శకాలు జారీచేసింది. అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలిచ్చింది. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై దృష్టిసారించి చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. ముప్పు ముంచుకురాకముందే కఠిన ఆంక్షలు అమలు చేయాలని, ఆ ఆంక్షలు కనీసం 14 రోజులు అమలులో ఉండేలా చూడాలన్నారు. ముఖ్యంగా పండగల వేళ రాత్రిపూట కర్ఫ్యూలను అమలుచేయడంతో పాటు భారీ సభలు, జనసమూహాల్ని నియంత్రించాలని ఆదేశించారు…కేంద్రం ఆదేశాల నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు నైట్‌ కర్ఫ్యూ అమలు చేయనున్నట్టు సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రకటించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు…