నెహ్రూ గురించి తాను ప్రస్తావించడంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వివరణ…

*నేను ఫలానా వ్యక్తి తండ్రి, తాతల గురించి మాట్లాడలేదు : మోదీ*

R9TELUGUNEWS.COM : పార్లమెంటులో మాజీ ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ గురించి తాను ప్రస్తావించడంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం వివరణ ఇచ్చారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తాను ఫలానా వ్యక్తి తండ్రి లేదా తాత గురించి మాట్లాడలేదన్నారు. మాజీ ప్రధాన మంత్రి చెప్పిన మాటలనే తాను ప్రస్తావించానన్నారు. ఆ మాటలను తెలుసుకోవడం దేశ ప్రజల హక్కు అని చెప్పారు. తాను నెహ్రూ గురించి మాట్లాడనని ప్రతిపక్షాలు అంటూ ఉంటాయని, తాను మాట్లాడితే మాత్రం వారికి కష్టంగా ఉంటుందని అన్నారు. ఈ భయం ఏమిటో అర్థం కావడం లేదన్నారు.పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన జనవరి 31న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు లోక్‌సభ, రాజ్యసభలలో మోదీ సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాజీ ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే.
ఐదు రాష్ట్రాల శాసన సభల ఎన్నికలకు ముందు మోదీ ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను నెహ్రూను ఎన్నడూ గుర్తు చేసుకోవడం లేదని అంటూ ఉంటారని, గుర్తు చేసుకున్నపుడు వివాదాస్పదం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. నెహ్రూ అప్పట్లో చెప్పిన మాటలనే తాను ప్రస్తావించానన్నారు. కాంగ్రెస్ పార్టీకి అంత భయం దేనికని ప్రశ్నించారు. అప్పటి, ఇప్పటి పరిస్థితులను వివరించేందుకే తాను ఆయనను ప్రస్తావించానన్నారు.
అనేక ఓటముల తర్వాతే గెలుపు…అనేకసార్లు పరాజయాలను చవి చూసిన తర్వాతే బీజేపీ గెలిచిందని చెప్పారు. తాము గెలిచినపుడు క్షేత్ర స్థాయిలో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. మనసులను గెలుచుకోవడం కోసం వచ్చే అవకాశాలను వదిలిపెట్టబోమని చెప్పారు. పరాజయంలో కూడా ఆశావాదంతో పని చేస్తామన్నారు. తాము గెలిచినా, ఓడినా, ఎన్నికలనేవి తమకు ఓ ఓపెన్ యూనివర్సిటీ వంటివన్నారు. ఎన్నికల్లో తాము నూతన రిక్రూట్‌మెంట్, ఆత్మావలోకనం చేసుకునే అవకాశాన్ని పొందుతామని చెప్పారు. తాము దీనిని ఎన్నికల క్షేత్రంగా పరిగణిస్తామని తెలిపారు.
ఐదు రాష్ట్రాల్లోనూ బీజేపీదే గెలుపుఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసన సభల ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా విజయం సాధిస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రాలన్నిటిలోనూ బీజేపీ వైపు మొగ్గు ఉన్నట్లు తాను గమనించానని చెప్పారు. ఈ ఎన్నికల్లో తాము (బీజేపీ) సంపూర్ణ ఆధిక్యతతో గెలుస్తామన్నారు. తాము అధికారంలో ఉన్నపుడు గొప్ప శక్తి సామర్థ్యాలతో, విస్తృత స్థాయిలో అందరితో కలిసి, అందరి అభివృద్ధి కోసం పని చేస్తామన్నారు. ఆ ఇద్దరూ దురహంకారులుసమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆర్ఎల్‌డీ చీఫ్ జయంత్ చౌదరిలను ప్రస్తావిస్తూ, ఈ ఇద్దరి ఆట చాలా పాతదేనని చెప్పారు. ఇద్దరబ్బాయిల ఆటను గతంలో కూడా చూశామన్నారు. రెండు గుజరాతీ గాడిదలు అని వారు గతంలో అన్నారని, అందుకు వారికి ఉత్తర ప్రదేశ్ గుణపాఠం చెప్పిందని తెలిపారు. మరోసారి ఇద్దరబ్బాయిలు, ఓ బువాజీ కలిశారని, అయినప్పటికీ వారికి కలిసిరాలేదని అన్నారు.