మోదీకి షాక్.. అవిశ్వాస తీర్మానానికి ఎన్డీయే భాగస్వామ్య పార్టీ మద్దతు..

*న్యూ ఢిల్లీ.. జాతీయ ప్రజాస్వామిక కూటమి (NDA)లో లుకలుకలు బయటపడ్డాయి. ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమి ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని ఎన్డీయే భాగస్వామ్య పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) నిర్ణయించింది..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ప్రతిపాదించిన ఈ అవిశ్వాస తీర్మానంపై మంగళవారం నుంచి చర్చ జరుగుతోంది. గురువారం మధ్యాహ్నం మోదీ ఈ చర్చకు సమాధానం చెబుతారు.

ఎంఎన్ఎఫ్ ఎంపీ సీ లాల్రోసంగ గురువారం మీడియాతో మాట్లాడుతూ, తాను అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తానని చెప్పారు. మణిపూర్‌లో హింసాకాండను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పారు. అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. దీనినిబట్టి తాను కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నానని కానీ, బీజేపీని వ్యతిరేకిస్తున్నానని కానీ భావించరాదన్నారు. ప్రభుత్వాలు, మరీ ముఖ్యంగా మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దడంలో విఫలమైందన్నారు..