పాత పార్లమెంట్‌కు ‘సంవిధాన్ సదన్’ అని పేరు పెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ..

పాత పార్లమెంట్‌కు ‘సంవిధాన్ సదన్’ అని పేరు పెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ..
పాత పార్లమెంట్‌లో కేంద్రం వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటుచేసింది. సెంట్రల్ హాల్‌లో ఈ భేటీ ఏర్పాటైంది. స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ప్రతిపక్ష నేతలు అధిర్ రంజన్ చౌదరి, మల్లికార్జున ఖర్గే.. వేదికపై ఆసీనులయ్యారు..

కొత్త పార్లమెంట్ భవనం మంగళవారం నుంచి ఉభయ సభల సమావేశాలకు వేదిక కానుంది. వినాయక చవితి సందర్భంగా కొత్త భవనాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi)
ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ… పాత పార్లమెంట్ భవనంలో తమ ప్రభుత్వ హయాంలో ఆమోదం పొందిన కీలక బిల్లుల గురించి ప్రస్తావించారు. ఈ పార్లమెంట్‌‌లో నిర్వహించిన సమావేశాల్లో దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ముస్లిం మహిళలకు న్యాయం చేశామని అన్నారు. ట్రిపుల్‌ తలాక్ రద్దు చట్టం ఇక్కడే ఆమోదం పొందిందని గుర్తు చేశారు.

ఈ భవనం గొప్ప చరిత్రను ప్రసంగంలో ప్రస్తావించారు. ఇది భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు. చంద్రయాన్-3 మిషన్, G20 ప్రెసిడెన్సీ వంటి భారతదేశం ఇటీవలి విజయాలను కూడా పీఎం హైలైట్ చేశారు..నేడు భారతీయులు సాధించిన అన్ని విషయాల గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. మన పార్లమెంటు ప్రారంభమైనప్పటి నుంచి గత 75 ఏళ్లుగా మనం కలిసి చేసిన కృషి దీనికి కారణం. చంద్రయాన్-3 విజయానికి భారతదేశంతో పాటు ప్రపంచం మొత్తం గర్విస్తోంది. సాంకేతికత, విజ్ఞాన శాస్త్రం, మన శాస్త్రవేత్తల సామర్థ్యంతో పాటు మన 140 కోట్ల మంది ప్రజల సామర్థ్యంతో భారతదేశం బలంగా ఉందని ఈ విజయం చెబుతోంది. ఈ రోజు, నేను మన శాస్త్రవేత్తలను మళ్లీ అభినందించాలనుకుంటున్నాను..G20 విజయాన్ని ఏకగ్రీవంగా అభినందించినందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. G20 విజయం 140 కోట్ల మంది భారత పౌరులది. ఇది భారతదేశ విజయం, ఒక వ్యక్తి లేదా పార్టీది కాదు. ఇది మనమందరం సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం..