మోదీ సర్కార్ తీపి కబురు.. వాటిపై పన్ను తగ్గింపు..!!..

ఫిబ్రవరి 1న కేంద్రంలోని మోదీ సర్కార్ తన మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతోంది. అయితే దీనికి ముందే పన్ను తగ్గింపులను ప్రకటించటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది..అవును బడ్జెట్ ప్రసంగానికి ఒక్కరోజు ముందు మోదీ సర్కార్ మెుబైల్ విడిభాగాల దిగుమతిపై సుంకాన్ని 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. దీనిపై దేశంలోని మెుబైల్ తయారీ పరిశ్రమ సంతోషం వ్యక్తం చేస్తోంది. తాజాగా చేసిన ప్రకటనతో రానున్న కాలంలో మెుబైల్ ఫోన్ ధరలు దేశంలో తగ్గనున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే 5జీ సాంకేతికత ఉన్న ఫోన్లను కొనాలనుకుంటున్న చాలా మంది వినియోగదారులకు ఇది పెద్ద శుభవార్తని చెప్పుకోవచ్చు..ఐఫోన్ వంటి దిగ్గజ కంపెనీ సైతం ఇండియాలో తన ఫోన్ల తయారీ, అసెంబ్లింగ్ కేంద్రాలను భారీగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా వీటిని ఎగుమతి చేస్తోంది. దీనికి తోడు మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఇది దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే మంచి ఫీచర్లు ఉన్న ఫోన్ల ధరలు తగ్గటం దేశీయ సామాన్య ప్రజలకు ఖర్చులను తగ్గిస్తూ ఊరటను కలిగిస్తుందని వారు అంటున్నారు.

భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ల తయారీ వ్యయాన్ని తగ్గించడానికి, దానితో సమానంగా పోటీ పడేందుకు మొబైల్ ఫోన్ రంగానికి సంబంధించిన కంపెనీలు దాదాపు 10 ఏళ్లుగా దిగుమతి సుంకాన్ని తగ్గించడం గమనార్హం. ఈ వ్యాపారంలో చైనా, వియత్నాం వంటి పోటీదారులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఈ ప్రోత్సాహం ఇండస్ట్రీని ప్రేరేపిస్తుంది. భారత్ నుంచి మొబైల్ ఫోన్ ఎగుమతులు వచ్చే రెండేళ్లలో మూడు రెట్లు పెరిగి 39 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని భారత సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ పేర్కొంది. అలాగే FY 2024లో భారతీయ మొబైల్ పరిశ్రమ సుమారు 50 బిలియన్ డాలర్లు విలువైన మొబైల్ ఫోన్‌లను తయారు చేస్తుందని అంచనా వేయబడింది..