వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం ,అలాంటి వాటికి భారతీయ జనతా పార్టీలో ఎన్నటికీ స్థానం లేదు…. ప్రధాని నరేంద్రమోదీ..

వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, అలాంటి వాటికి భారతీయ జనతా పార్టీలో ఎన్నటికీ స్థానం లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. అంతేగాక, ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ నేతల పిల్లలకు టికెట్లు ఇవ్వకపోడానికి కారణం తానేనని మోదీ ఈ సందర్భంగా చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ..భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం దిల్లీలోని అంబేడ్కర్‌ కేంద్రంలో జరిగింది. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో భాజపా అఖండ విజయం సాధించడంతో ప్రధాని మోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను పార్టీ నేతలు సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. వారసత్వ రాజకీయాలపై నేతలకు కీలక సూచనలు చేశారు.
కుటుంబ పార్టీలు దేశాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. వారసత్వ రాజకీయాలతో ప్రజాస్వామ్యానికి ముప్పు. అలాంటి వాటికి వ్యతిరేకంగా భాజపా పోరాడుతోంది. అలాంటప్పుడు పార్టీ కూడా అందుకు ఉదాహరణగా నిలవాలి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాలా మంది పార్టీ పార్లమెంట్‌ సభ్యులు, నేతలు తమ పిల్లలకు టికెట్లు అడిగారు. అయితే ఇందులో చాలా మంది అభ్యర్థులను పార్టీ తిరస్కరించింది. ఇందుకు పూర్తి బాధ్యత నాదే. నా వల్లే మీ పిల్లలకు పార్టీ టికెట్లు ఇవ్వలేదు. వారసత్వ రాజకీయాలు కులతత్వానికి దారితీస్తాయి. దీనిపై ఎంపీలందరూ పోరాడాలి. కుటుంబ పార్టీల నైజాన్ని బయటపెట్టాలి’’ అని మోదీ పార్టీ నేతలకు పిలుపునిచ్చినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన నేతలు, ఎంపీలకు ప్రధాని కృతజ్ఞతలు తెలియజేశారు.

*‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’పై మోదీ ప్రశంసలు..*

ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన బాలీవుడ్‌ చిత్రం ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ‘‘ఇది చాలా మంచి సినిమా. మీరందరూ తప్పకుండా చూడాలి. ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలి’’ అని మోదీ పార్టీ నేతలతో అన్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.