మోడీ చేసిన వ్యాఖ్యలపై హరీష్‌రావు రియాక్షన్!!

*మోడీ చేసిన వ్యాఖ్యలపై హరీష్‌రావు రియాక్షన్!!

ముఖ్యమంత్రి కేసీఆర్ కవితపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై బుధవారం మంత్రి హరీష్‌రావు స్పందించారు. బీఆర్‌ఎస్ బలపడుతుందన్న భయంతోనే మోడీ వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కేసీఆర్ ఎవరి ఏజెంట్ కాదని.. రైతుల ఏజెంట్ అని స్పష్టం చేశారు. మహారాష్ట్ర సభకు విశేష స్పందన వచ్చిందని.. ఆదాని బలపడాలంటే మోడీని గెలిపించాలంటూ వ్యాఖ్యలు చేశారు. ఎవరెన్ని సభలు పెట్టినా గెలిచేది బీఆర్‌ఎస్ పార్టీనే అని స్పష్టం చేశారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా కేసీఆర్ ముందు అవేమీ చెల్లవన్నారు. తాము వద్దనుకున్న వారు, బహిష్కరించిన వారు మాత్రమే వేరే పార్టీలో చేరుతున్నారని మంత్రి హరీష్ రావు చెప్పుకొచ్చారు.

కాగా.. నిన్న మంగళవారం భోపాల్‌లో బీజేపీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్‌పై ప్రధాని మోదీ విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. ‘‘కేసీఆర్‌ బిడ్డ బాగు కోసమే అయితే.. బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటేయండి. మీ పిల్లలు, మనవలు, తదుపరి తరాల సంక్షేమం కోసమైతే బీజేపీకి ఓటు వేయండి’’ అని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ పేరు ప్రస్తావించి మరీ ఆయన కుమార్తె కవిత అవినీతిపై ప్రధాని పరోక్ష వ్యాఖ్యలు చేశారు..