రేషన్ కార్డు దారులకు మోడీ గుడ్ న్యూస్…

ప్రధాని మోడీ ఇవాళ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఛత్తీస్ ఘడ్ లో జరిగిన సభలో ఓ కీలక హామీ ఇచ్చారు. పేదలకు ఇప్పటివరకూ అందుతున్న ఓ ప్రయోజనాన్ని వచ్చే ఐదేళ్ల పాటు పొడిగిస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు.

దేశవ్యాప్తంగా పేదల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఉచిత రేషన్ పథకాన్ని అమలు చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది పేదలు లబ్ది పొందుతున్నారు. కేంద్రం అందిస్తున్న ఉచిత రేషన్ పథకాన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు తమదిగా చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నాయి కూడా. ఈ నేపథ్యంలో పేదలకు ఎంతో ఉపయోగపడుతున్న ఈ ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్ల పాటు కొనసాగిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.

ఇప్పటికే దేశవ్యాప్తంగా రైతులతో పాటు పలు వర్గాలకు ఎన్నికల హామీల్ని ఇస్తూ, పలు పథకాలు ప్రకటిస్తున్న ప్రధాని మోడీ ఇదే క్రమంలో ఉచిత రేషన్ పథకం కొనసాగింపును కూడా ప్రకటించినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి అంతంతమాత్రంగానే గెలిచే అవకాశాలు ఉన్నట్లు తేలిపోవడంతో ప్రధాని మోడీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇలాంటి హామీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటర్లు వీటిని ఎంతమేరకు విశ్వసిస్తారన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు.ఓవైపు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల పేరుతో సంక్షేమ పథకాల హామీలు భారీ స్దాయిలో ఇస్తున్న నేపథ్యంలో మోడీ ఈ ప్రకటనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.