పోలీసు వాహనాలను సైతం వదలని కేంద్ర బలగాలు.!.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చేపడుతున్న తనిఖీల్లో పోలీసు వాహనాలనూ వదలడం లేదు. తనిఖీల సమయంలో ఏదైనా పోలీస్‌ వాహనం అటుగా వెళ్తుంటే కేంద్ర బలగాలు తనిఖీ చేస్తున్నాయి.

వాహనాలను అన్ని కోణాల్లో పరిశీలించి కేంద్ర బలగాలు సంతృప్తి పడిన తర్వాతే పంపుతున్నట్లు తెలిసింది. పోలీస్‌ సిబ్బంది గత ఎన్నికల్లో ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి.

డబ్బు సంచులను పోలీస్‌ వాహనాల్లోనే తరలించి ఓటర్లకు పంపిణీ చేశారని ప్రత్యర్థులు ఆరోపించారు. ఈ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి రావొద్దని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల నిర్వహణలో కేంద్ర బలగాలు చాలా పకడ్బందీగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. లోకల్‌ పోలీసుల మాటలను పట్టించుకోవడంలేదని ఓ పోలీస్‌ అధికారి వెల్లడించారు.

మరోపక్క ట్రై కమిషనరేట్ల సీపీలు సైతం విధినిర్వహణలో కచ్చితంగా వ్యవహరించాలని, నిర్లక్ష్యం వహించినా, అలసత్వం ప్రదర్శించినా కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు. బోరబండ ఇన్‌స్పెక్టర్‌ వద్ద రౌడీషీటర్ల సమాచారం లేకపోవడంతో సీపీ కార్యాలయానికి ఆయనను హైదరాబాద్‌ సీపీ అటాచ్‌ చేశారు.

ఎస్‌ఆర్‌ నగర్‌ పరిధిలో రౌడీషీటర్ల మధ్య గ్యాంగ్‌వార్‌, మర్డర్‌ జరగడంతో అక్కడే ఇన్‌స్పెక్టర్‌, ఏసీపీలకు చార్జి మెమో ఇచ్చినట్లు సమాచారం..