పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, గడ్డం వంశీకృష్ణలకు బీఆర్ఎస్ పార్టీ లీగల్ నోటీసులు..!

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, గడ్డం వంశీకృష్ణలకు బీఆర్ఎస్ పార్టీ లీగల్ నోటీసులు

కొండపోచమ్మ సాగర్ నుంచి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీళ్లు తీసుకెళ్లారని, కేసీఆర్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని లీగల్ నోటీసులు పంపిన బీఆర్ఎస్ లీగల్ సెల్

నోటీసులకు స్పందించకపోతే పరువు నష్టం దావాతో పాటు ఇతర చట్టాల ప్రకారం న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక…

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా, కొండపోచమ్మ సాగర్‌ నీటిని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లించారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ గడ్డం వంశీకృష్ణలకు బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ నోటీసులు జారీ చేసింది. ఈ మేర‌కు బీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ, లీగల్‌ సెల్‌ ఇన్‌ఛార్జ్‌ సోమ భరత్‌ కుమార్‌ ఈ నోటీసులు పంపించారు.

ఇదే అంశంపై ఇప్పటికే వెలుగు దినపత్రిక యాజమాన్యం, ఎడిటర్‌కు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో, అదే ప్రచారాన్ని కొనసాగిస్తున్న ముగ్గురు కాంగ్రెస్‌ నేతలకు కూడా నోటీసులు పంపించారు. తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో చేసిన సంబంధిత పోస్టులను తక్షణమే బేషరతుగా తొలగించి, తప్పుడు ప్రచారాన్ని ఉపసంహరించుకోవాలని బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ డిమాండ్‌ చేసింది.

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను సహించబోమని, నోటీసులకు స్పందించని పక్షంలో పరువు నష్టం సహా వర్తించే చట్టాల ప్రకారం తదుపరి న్యాయపరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేసింది..