సభను అడ్డుకునేందుకు BRS కుట్రలు..ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీఆర్ఎస్ సర్కార్..మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి..

‘పొంగులేటి ఎమోషనల్.. సభను అడ్డుకునేందుకు BRS కుట్రలు’

Ponguleti Srinivas Reddy fires on BRS : ఖమ్మం నగరంలో కాంగ్రెస్‌ పార్టీ ఇవాళ నిర్వహించబోయే జనగర్జన సభకు అడ్డంకులు సృష్టిస్తోందని రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీఆర్ఎస్ సర్కార్ ఖమ్మం సభ వేదికగా చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సభకు ఇబ్బందులు కల్పించడం సబబు కాదంటూ ఒకింత భాగోద్వేగానికి గురయ్యారు. ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను అనుసరించే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. అధికారులపై ఒత్తిడి పెడుతూ నేడు నిర్వహించే సభకు అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 

ప్రలోభాల పేరుతో ప్రజల దృష్టి మరల్చేందుకు బీఆర్ఎస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారని పొంగులేటి ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం ఖమ్మం గడ్డ నుంచి మెుదలైందని… బీఆర్ఎస్ ప్రభుత్వ పతనం కూడా ఇవాళ ఈ సభ నుంచే మొదలవుతుందని పొంగులేటి పేర్కొన్నారు. ‘నేను సత్యాగ్రహ మార్గంలో పోరాడతా. సభను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇవ్వకకుండా మా వాహనాలు అడ్డుకుంటున్నారు. 1,700 వాహనాలు అడ్డుకుని ఆర్సీలు, లైసెన్స్‌లు తీసుకున్నారు. అర్ధరాత్రి నుంచి వాహనాలు సీజ్ చేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ విజయవంతం అవుతుంది’ అని పొంగులేటి వ్యాఖ్యానించారు..