క్యాసినో కేసులో చికోటి ప్రవీణ్ బృందాన్ని విచారిస్తున్న ఈడీ..

క్యాసినో హవాలా కేసులో చికోటి ప్రవీణ్‌ ఈడీ విచారణ కొనసాగుతోంది. ప్రవీణ్‌ను ఈడీ అధికారుల వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. క్యాసినో వ్యవహారంతో పాటు హవాలా రూపంలో నగదు బదిలీలపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అలాగే సంపత్, మాధవరెడ్డి, బబ్లు, రాకేష్, వెంకట్‌‌ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. సినీ రాజకీయ నేతలతో చికోటి ప్రవీణ్‌కు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం…

గత ముూడేళ్లుగా జరిగిన బ్యాంకు లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. మూడు గంటలకుపైగా చికోటి ప్రవీణ్, మాధవ రెడ్డిలను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. హవాలా ద్వారా డబ్బులు తరలింపుపై వారిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగు దేశాల్లో 7 సార్లు జరిగిన క్యాసినో క్యాంపులపై ఆరాతీస్తున్నారు. బిగ్ డాడీ పేరుతో నిర్వహించిన క్యాసినో క్యాంప్ కు ఎవరెవరు హాజరయ్యారనే దానిపై ఈడీ అధికారులు విచారిస్తున్నారు…

క్యాసినో డాన్ చికోటి ప్రవీణ్ కుమార్ బాగోతాలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈడీ రంగంలోకి దిగడంతో ప్రవీణ్ కుమార్ చీకటి దందాలో రెండు రాష్ట్రాల్లోని సినీ, రాజకీయ ప్రముఖుల పాత్రపై సర్వత్రా టెన్షన్ ఏర్పడింది.

క్యాసినో వ్యవహారంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉందని, ప్రవీణ్ కు అధికార పార్టీ అండదండలు మెండుగా ఉన్నాయనే విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఓ ట్వీట్ మరింత దుమారం రేపుతోంది. సోషల్ మీడియాలో ఇప్పుడీ ట్వీట్ రచ్చకు దారి తీస్తోంది. ప్రవీణ్ కుమార్ చికోటీ పేరుతో ఉన్న ఓ ట్వీట్ స్క్రీన్ షార్ట్ లో ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా చెప్పబడుతోంది. ‘నన్ను బలిపశువును చేయాలని చూస్తే, నా చేత ఈ పనులు చేయించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టను, సీఎం అయినా మంత్రులు అయినా ఇంకెవరైనా అందరికీ ఒకటే న్యాయం’ అని రాసి ఉంది. ఈ ట్వీట్ ఇమేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చికోటి వెనకాల టీఆర్ఎస్ కు చెందిన పెద్ద తలకాయలు ఉన్నాయని ప్రతిపక్షం నుండి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో సోషల్ మీడియాలో ఈ తరహా ప్రచారం సర్వత్రా హాట్ టాపిక్ అవుతోంది. నిజంగానే ఈ చీకటి దందా వెనుక టీఆర్ఎస్ పెద్దల హస్తం ఉందా? ఈడీ ఉచ్చుబిగిస్తే ప్రవీణ్ అన్ని విషయాలు బహిర్గతం చేయనున్నారా? దాంతో నిజంగానే టీఆర్ఎస్ పెద్దల బాగోతం బయటపడనుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ ట్వీట్ నిజమే అయితే గనుక చికోటి ప్రవీణ్ వెనుక ఉన్నదెవరనేది ఉత్కంఠ రేపుతోంది.