రాష్ట్ర‌ప‌తి ఎన్నిక పోలింగ్.. ఓటేసిన 118 మంది ఎమ్మెల్యేలు….

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక పోలింగ్.. ఓటేసిన 118 మంది ఎమ్మెల్యేలు..
తెలంగాణ అసెంబ్లీ క‌మిటీ హాలులో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక పోలింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా ముగిసింది. ఈ పోలింగ్‌లో తెలంగాణ‌కు చెందిన 117 మంది ఎమ్మెల్యేల‌తో పాటు ఆంధ్రప్రదేశ్ కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి కూడా ఇక్కడే తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. క‌రీంన‌గ‌ర్ ఎమ్మెల్యే గంగుల క‌మ‌లాక‌ర్ క‌రోనా కార‌ణంగా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. వేముల‌వాడ ఎమ్మెల్యే చెన్న‌మ‌నేని ర‌మేశ్ విదేశాల్లో ఉన్నారు. దీంతో వీరిద్ద‌రూ త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోలేక‌పోయారు. ఈ ఎన్నికల్లో రాష్ట్ర శాసనసభ్యుల ఓటు విలువ 132. మొత్తం 119 మందికి సంబంధించిన ఓట్ల విలువ 15,708.
అసెంబ్లీ క‌మిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మొట్ట‌మొద‌ట రాజ‌న్న సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఆ త‌ర్వాత ప‌లువురు ఎమ్మెల్యేలు ఓటేశారు. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల స‌మ‌యంలో సీఎం కేసీఆర్, స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మారావు గౌడ్, మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డి త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు… ఎన్నికల అధికారులు ఇచ్చిన బ్యాలెట్‌పేపర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క‌.. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌప‌ది ముర్ముకు ఓటేశారు. పొర‌పాటును గ్రహించిన ఆమె మరో బ్యాలెట్‌ పేపర్‌ ఇవ్వాలని ప్రిసైడింగ్‌ అధికారులను కోరారు. అయితే నిబంధనల ప్రకారం మరో బ్యాలెట్‌ పేపర్‌ ఇవ్వలేమని అధికారులు చెప్పారు.