ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా..

బీబీనగర్: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్ప గాయలతో బయట పడటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన బీబీనగర్ మండల కేంద్రం సమీపంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. ప్రయాణికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరు నుండి వరంగల్ వయా హైదరాబాద్ నుండి ప్రయాణిస్తున్న AP39W 2966 నంబర్ గల మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి అదుపుతప్పి పక్కన ఉన్న సర్వీస్ రోడ్డుపై బోల్తా పడింది. వాహనంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు చిన్నపాటి గాయాలయ్యాయి. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు బస్సు అద్దాలను పగలగొట్టి ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో బస్సు లో 30మంది ప్రయాణికులు వున్నారు.