మ‌రో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూలింది…సీఎం రాజీనామా…

మ‌రో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూలింది. పుదుచ్చేరి అసెంబ్లీలో సోమ‌వారం జ‌రిగిన బ‌ల‌ ప‌రీక్ష‌లో ముఖ్య‌మంత్రి నారాయ‌ణ‌స్వామి త‌న మెజార్టీ నిరూపించుకోవ‌డంలో విఫ‌ల‌మయ్యారు. దీంతో ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. బ‌ల‌ ప‌రీక్ష‌లో విఫ‌ల‌మైన త‌ర్వాత నేరుగా రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లిన ఆయ‌న‌.. లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైకి రాజీనామా అంద‌జేశారు. మెజార్టీ నిరూపించుకోవ‌డానికి 14 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు అవ‌స‌రం కాగా.. కాంగ్రెస్ ద‌గ్గ‌ర 12 మంది స‌భ్యుల బ‌లం మాత్ర‌మే ఉంది. ఆదివారం ఇద్ద‌రు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. విశ్వాస ప‌రీక్ష‌లో ఓటింగ్‌కు ముందు మాట్లాడిన నారాయ‌ణ‌స్వామి.. త‌మ‌కు మెజార్టీ ఉన్న‌ద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఈ సంద‌ర్భంగా మాజీ గ‌వ‌ర్న‌ర్ కిర‌ణ్ బేడీపై ఆయ‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు. త‌న ప్ర‌భుత్వాన్నిప‌డ‌గొట్ట‌డానికి ప్ర‌తిప‌క్షంతో చేతులు క‌లిపిన‌ట్లు విమ‌ర్శించారు.
రాజీనామాలు..
మొత్తం 33 మంది సభ్యులు కలిగిన పుదుచ్చెరి అసెంబ్లీలో రీసెంటుగా కొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. చివరికి 26 మంది మిగిలారు. నారాయణ స్వామి గవర్నమెంట్ బల పరీక్షలో గట్టెక్కాలంటే మొత్తం సభ్యుల్లో సగం కంటే ఒక్కరు ఎక్కువ (14 మంది) ఉన్నా సరిపోతుంది. కానీ హస్తం పార్టీ తరఫున 12 మందే ఉన్నారు. ఇందులో స్పీకర్ తో కలిపి కాంగ్రెస్ వాళ్లు పది మంది కాగా డీఎంకేవాళ్లు ఇద్దరు కావటం గమనార్హం. ఈ నేపథ్యంలో సీఎం నారాయణ స్వామి సైతం రాజీనామా చేయాల్సి వచ్చింది.