ఒక్క కొడుకు ఉంటే కీడు…సంక్రాంతికి ముందు ఐదు రకాల గాజులు ధరించకుంటే కీడు..

సంక్రాంతి 'కీడు'.. పండగ వేళ రూమర్ హల్‌చల్..

ప్రస్తుతం గ్రామాలలో పట్టణాలలో నడుస్తున్న ఓ పుకారు హల్చల్…. సంక్రాంతి పండక్కి ముందుకి వచ్చిందంటూ పుకార్లు షికార్లు చేస్తున్న వేళ… ఏ రచ్చబండ దగ్గర చూసినా ప్రస్తుతం ఇదే చర్చ… ఈ కాలంలో కూడా ఇలాంటివి ఉంటాయా..!??
నేటి రోజుల్లో ఎన్నో వింత ఆచారాలు, మూఢనమ్మకాలు సమాజంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని రూపుమాపేందుకు ఓవైపు ప్రయత్నాలు జరుగుతుంటే మరోవైపు అటువంటి నమ్మకాలు రోజుకొకటి తెరమీదకు తీసుకువస్తూ వాటిని ప్రచారం చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. త్వరలో సంక్రాంతి పండగ రాబోతున్న వేళ తాజాగా మరో పుకారు ఇంటర్నెట్‌లో జోరుగా ప్రచారం అవుతున్నది. ఒక్కడే కొడుకు ఉన్న మహిళలు వెంటనే ఈ పని చేయాలని లేకుంటే కీడు తప్పదంటూ ఓ ప్రచారం పట్టణాల నుంచి పల్లెల వరకు స్పీడ్‌గా పాకుతోంది. దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

*ఒక్క కొడుకు ఉంటే కీడు*

ఈ సంవత్సరం సంక్రాంతి పండగ కీడు వచ్చింది. అందుకని ఒక్క కొడుకు ఉన్న మహిళలు, ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది కుమారులు ఉన్న మహిళల వద్ద నుంచి డబ్బు తీసుకోవాలి. ఆ డబ్బుతో వారు ఐదు రకాల గాజులు కొనుక్కుని వాటిని ధరించాలి. ఇది సంక్రాంతి పండగ లోపు పూర్తి చేయాలి. లేకుంటే కీడు తప్పదు’ అంటూ ఓ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతున్నది. దీంతో ఈ విషయం చెవిన పడ్డ ఒక్క కొడుకు కలిగిన మహిళలంతా ఇద్దరు కుమారులు కలిగిన తమ బంధువులు, ఫ్రెండ్స్ వద్ద నుంచి డబ్బులు తీసుకుని గాజులు ధరిస్తున్నారు. అలా తాము ధరించిన గాజులతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఇది నిజం కాదు..

ఈప్రచారాన్ని నమ్మి ఆచరిస్తున్న వారు కొందరుంటే ఇదంతా ఉత్తిదే అని మరికొందరు వాదిస్తున్నారు. గతంలోనూ సంక్రాంతి, ఉగాదితో పాటు వివిధ పండగలకు ముందు వదిన మరదళ్ళు గాజులు, అన్నదమ్ముల్లకు కుడుకలు, ఆడబిడ్డలకు కుంకుమ భరణాలు, వదిన ఆడపడుచులు చీరలు పంచుకోవాలి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సందర్భాలు ఉన్నాయి. అలాగే బంగారం, వెండి మాట్లాడుతుందంటూ గ్రామాల్లో పుకార్లు షికార్లు చేసిన విషయాలు తెలిసిందే. ఈసారి సంక్రాంతికి ముందు ఐదు రకాల గాజులు ధరించకుంటే కీడు తప్పదంటూ కొత్త పుకారు తెరమీదకు తీసుకవచ్చారు. వీటిలో ఎటువంటి నిజం లేదని విద్యావేత్తలు చెబుతున్నారు. ఇటువంటి ప్రచారంతో ఆయా వ్యాపారులే లబ్ధి పొందుతారు తప్ప ఎవరికి ఏ హాని జరగదని వాదిస్తున్నారు… ప్రజలు ఇది ఏమాత్రం వరకు నిజమని నమ్ముతారు వేచి చూడాల్సిందే మరి… భక్తి ఉండాలి కానీ మూడో భక్తి అనేది కరెక్ట్ కాదు అనేది పలువురు వాదన..