పులసలు పడుతున్నాయండోయ్… -అన్ని అరకేజీలు లోపే…

పులస ప్రియులకు ఇదో శుభవార్తే. ఏటా వచ్చే వరదల సీజన్లో మాత్రమే లభ్యమయ్యే పులస చేపల కూర తినాలని ఎంతోమంది తహతహలాడుతుంటారు.”పెళ్లాం మెడలో పుస్తెలు అమ్మైనా సరే పులస తినాలి”అనే నానుడు గోదావరి జిల్లాల్లో ఎప్పటినుంచో ఉంది.దాని రుచి ఆ స్థాయిలో ఉంటుంది మరి. అయితే ఈ ఏడాది మూడుసార్లు వరదలు రావడం వల్ల పులసలు జాలర్ల వలలకు చిక్కలేదు. దీంతో సముద్రంలో దొరికే విలసలతోనే పులసను తిన్న సంతృప్తిని పొందారు చాలా మంది భోజన ప్రియలు.
కానీ వరదల సీజన్ ముగుస్తున్న ప్రస్తుత తరుణంలో పులసలు జోరుగానే పడుతున్నాయి. అయితే ఇవి అరకేజీ మించి ఉండడం లేదు.కాని ఊహించిన దాని కంటే ఎక్కువగానే అవి పడుతుండటంతో సామాన్యులకు కూడా ఈ ఒరిజినల్ గోదావరి పులసలు కొనుక్కోవడానికి వీలు దొరుకుతుంది. మొన్నటి వరకు అక్కడక్కడా ఒకటి రెండు పులసలు పడినప్పటికీ అవి ఇరవై నుంచి పాతిక వేల రూపాయలు పలకడం మనకు తెలిసిందే. కాని ఇప్పుడు ఈ పులసలు సైజును, సమయాన్ని బట్టి రెండు వేల నుంచి అయిదు వేల రూపాయలకు అమ్ముతున్నారు.ఈ గోదావరి పులసలకు ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా కడియం పొట్టిలంకలో ఉదయం,సాయంత్రం వేళల్లో వీటి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కపిలేశ్వరపురం, కె.గంగవరం మండలానికి చెందిన పలు మత్స్యకార కుటుంబాల వారు పొట్టిలంక గోదావరి ఒడ్డుకు వరదల సీజన్లో వలస వచ్చి వేటాడుతుంటారు. అయితే ఈ ఏడాది అంతా పులసలు పడక వారిని ఉసూరుమనిపించింది. ఇప్పుడు కొంత ఊరట కలిగిస్తుంది.గత వారం రోజులుగా ఈ పులసలు జాలర్ల వలలకు భోజన ప్రియుల నోటికి చిక్కుతున్నాయి.
ధవళేశ్వరం బ్యారేజ్ సమీపంలో ఉండే ఈ పొట్టిలంక పులసలకు మంచి రుచి ఉండడం వల్ల కొనుగోలు చేయడానికి దూర ప్రాంతాల నుండి వస్తుంటారు. అయితే జూలై నెల నుంచే వరద నీటి ప్రవాహం అధికంగా ఉండటం వల్ల మత్స్యకారుల కుటుంబాలను నిరాశపరిచింది.పులస ప్రియుల పరిస్థితి అదే.పులసలు దొరకక పోవడంతో విలసలతో సరిపెట్టుకున్నారు. దాదాపు అందరూ మర్చిపోయిన సమయంలో ఇప్పుడు పులసలు విరివిగా పడటం వల్ల అందుబాటు ధరల్లోకి వస్తున్నాయి. గత వారం రోజులుగా పొట్టిలంకలో పులసల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అరకేజి పులసల నాలుగైదు వేల రూపాయలు కూడా దొరుకుతుంది. కొన్ని సమయాలలో రూ.3వేలకు అమ్ముతున్నారు. అక్కడ కొనుగోలుదారులు రాకను బట్టి రేటు హెచ్చుతగ్గులు ఉంటాయి.నాలుగు లైన్ల జాతీయ రహదారి పక్కనున్న ఈ పొట్టిలంకలో కార్లుపై వెళ్లే వాళ్లు ఆగి కొనుక్కుంటారు. డబ్బును లెక్కచేయని వారు కారు దిగికుండానే బేరం లేకుండా అధిక ధరకు కొనుగోలు చేస్తుంటారు. సముద్రంలో దొరికే ఒరిస్సా విలసలు కేజీ వెయ్యి నుంచి మూడు వేల రూపాయలు వరకు ఈ ఎడాది పలికాయి. కాని విలసకు పులుసకు మధ్య రుచిలో తీవ్ర వ్యత్యాసం ఉంటుంది. ధర కూడా ఆస్థాయిలోనే తేడా ఉంటుంది. ఈ పులుసలలో కూడా సెన(ఆడ), గొడ్డు(మగ) అనే రెండు రకాల ఉంటాయి. ఈ రెండిట్లో సెన చేపకు మరింత రుచి ఉండటం వల్ల దాని ధర కూడా అధికంగానే ఉంటుంది. ఏదేమైనా పులస సీజన్ ముగుస్తున్న తరుణంలో ఇవి దొరుకుతుండటం సామాన్యులకు కూడా ఆనందం కలిగిస్తుంది.