వైసీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య పై నాన్ బెయిలబుల్ కేసు…!!!

బీసీ సంఘం అధ్యక్షుడు, వైసీపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన ఆర్.కృష్ణయ్యపై హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో నాన్‌బెయిలబుల్ కేసులు నమోదైంది.తనపై కృష్ణయ్య రౌడీలతో బెదిరింపులకు పాల్పడుతున్నారని రవీందర్ రెడ్డి ఆరోపించారు. ఆర్.కృష్ణయ్య వేధిస్తున్నాడంటూ కోర్టును ఆయన కోర్టును ఆశ్రయించారు. దీంతో రాయదుర్గం పీఎస్‌లో ఆర్.కృష్ణయ్యతో పాటు మరికొందరిపై కేసు నమోదైంది. ఆర్ కృష్ణయ్యపై 447, 427,506, 384 రెడ్ విత్ 341 సెక్షన్ల కింద కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై ఆర్.కృష్ణయ్య ఇంకా స్పందించలేదు.
గతంలో తెలంగాణ నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఆర్.కృష్ణయ్య.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలో అనూహ్యంగా ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. మొత్తం నాలుగు స్థానాల్లో ఇద్దరు ఓసీలు, ఇద్దరు బీసీలకు చోటు కల్పించిన సీఎం వైఎస్ జగన్.. వారిలో ఆర్.కృష్ణయ్యకు కూడా చోటు కల్పించారు.
తెలంగాణకు చెందిన ఆర్.కృష్ణయ్యను సీఎం జగన్ ఏపీ కోటాలో రాజ్యసభకు పంపడంపై విపక్ష టీడీపీ విమర్శలు గుప్పిస్తున్నా.. ఏపీ సీఎం జగన్ మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. బీసీల కోసం పోరాడుతున్న కృష్ణయ్యను రాజ్యసభకు పంపడం ద్వారా ఏపీలోని బీసీ వర్గాలను మరింతగా తమకు చేరువ చేసుకోవాలనే యోచనలో ఉన్న వైసీపీ.. ఆయనకు రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది.అయితే తాజాగా తెలంగాణలో ఆయనపై భూకబ్జా కేసు నమోదు కావడంతో.. ఈ పరిణామాలు ఆయనపై ఏ రకమైన ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.