మ్యాప్‌ మై ఇండియా. గూగుల్‌ ప్రత్యామ్నాయంగా …

విదేశీ మ్యాపులతో భద్రతకు ముప్పు
‘గూగుల్‌ మ్యాప్స్‌ ఉచితం అనుకొంటారు.

కానీ మనకు తెలియకుండా అందులో చాలా లొసుగులు ఉన్నాయి. మ్యాప్స్‌ వాడుతున్న సమయంలో ప్రకటనల ద్వారా సంస్థకు ఆదాయం వస్తుంది. కంపెనీలు ప్రకటనలు ఇవ్వడానికి మన లొకేషన్‌ను తీసుకొంటాయి. ఇది సమాచార భద్రతపరంగా ప్రమాదకరమైన అంశం’ అని రోహణ్‌ వర్మ చెప్పారు. మ్యాప్‌మై ఇండియాలో ఇలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవని చెప్పారు.

క్యాబ్‌ డ్రైవర్‌ మనలను గమ్యం చేర్చాలంటే గూగుల్‌ మ్యాప్స్‌.. స్విగ్గీ డెలివరీ బాయ్‌ ఇంటికి రావాలంటే గూగుల్‌ మ్యాప్స్‌.. మనం ఎక్కడికైనా వెళ్తే రూట్‌ తెలుసుకోవాలంటే గూగుల్‌ మ్యాప్స్‌.. ఏదైనా ప్రదేశాన్ని ఇంటర్నెట్‌లో వెతకాలంటే గూగుల్‌ మ్యాప్స్‌.. దైనందిన కార్యక్రమాల్లో గూగుల్‌ మ్యాప్స్‌ ఒక భాగమైపోయింది. ఈ కారణంగానే అనేక కంపెనీలు గూగుల్‌ సహకారంతో మనం ఉన్న లొకేషన్‌ను బట్టి ప్రకటనలు గుప్పిస్తున్నాయి. ప్రకటనల ఆదాయం కోసం గూగుల్‌ మన సమాచారాన్ని కంపెనీలకు ఇస్తున్నది. ఇది వ్యక్తిగత సమాచార భద్రతకు ఎంతో ముప్పు. అందుకే గూగుల్‌ మ్యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా, పూర్తి స్వదేశీ సాంకేతికతతో భారతీయులకు నావిగేషన్‌, మ్యాప్స్‌ సేవలను అందించేందకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), మ్యాప్‌ మై ఇండియా జతకట్టాయి. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ (డీవోఎస్‌), మ్యాప్‌ మై ఇండియా మాతృసంస్థ సీఈ ఇన్ఫో సిస్టమ్స్‌తో గురువారం ఒప్పందం కుదిరినట్టు ఇస్రో వెల్లడించింది. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా ఈ ఒప్పందం జరిగినట్టు మ్యాప్‌ మై ఇండియా సీఈవో రోహణ్‌ వర్మ చెప్పారు. ‘స్వదేశీ నావిగేషన్‌ సేవల్లో ఈ ఒప్పందం ఓ మైలురాయి’ అని అభివర్ణించారు. ‘మ్యాప్‌ మై ఇండియా సంస్థ బాధ్యతాయుతమైన, స్థానిక కంపెనీ. దేశసార్వభౌమత్వాన్ని ప్రతిబింబించేలా మ్యాపులను రూపొందించగలదు. భారత ప్రభుత్వం ప్రకారం సరిహద్దులను సూచించగలదు’ అని అన్నారు..