ప్రాజెక్ట్ నిర్మాణాన్ని రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ వారితో రహస్యంగా పనులు జరపడం దురదృష్టకరం…దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు

మల్లన్నసాగర్ ముంపు గ్రామాలైన ఏటిగడ్డ కిష్టపూర్, వేములగట్ గ్రామాల వద్ద కట్ట పనులు పరిశీలించడానికి పోలీసులు అనుమతి నిరాకరించారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మండిపడ్డారు. జిల్లా యంత్రాంగం కేసీఆర్, హరీష్ రావు కనుసన్నలో మెదులుతున్నారని విమర్శించారు. మల్లన్న సాగర్ ముంపు బాధితులకు అండగా ఏటిగడ్డ కిష్టాపూర్ వెళ్తున్న రఘునందన్ను పోలీసులు అరెస్ట్ చేసి చేర్యాల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ వారితో రహస్యంగా పనులు జరపడం దురదృష్టకరమన్నారు. ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉండాల్సిన అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కొన్ని నెలల క్రితం తహసీల్దార్, చెక్కుల విషయంలో ఆర్డీవో జైలుకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయన్నారు. దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యేగా తొగుట మండల ముంపు గ్రామాల ప్రజలకు నష్ట పరిహారం విషయంలో, ఎలాంటి విషయంలోనైనా వారికి అండగా ఉండి.. రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు. రెండు, మూడు రోజుల్లో ముంపు గ్రామాల పర్యటనపై కార్యాచరణ ప్రకటించనున్నట్లు ఎమ్మెల్యే రఘునందన్‌రావు తెలిపారు.