బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నేను అర్హుడిని కానా? అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మార్పుపై వ‌స్తున్న వార్త‌ల‌న్నీ నిజ‌మే. రఘునందన్‌రావు.సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నేను అర్హుడిని కానా?: రఘునందన్‌రావు

తెలంగాణ బీజేపీలో విచిత్ర పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో బీజేపీ చీఫ్ మార్పు జరగబోతోందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు అప్పజెప్పి.. బండిని కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకోబోతున్నారంటూ వార్తలు వినిపించాయి.

దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మార్పుపై వ‌స్తున్న వార్త‌ల‌న్నీ నిజ‌మేన‌ని ర‌ఘునంద‌న్ రావు స్ప‌ష్టం చేశారు. ప‌దేండ్ల నుంచి పార్టీకి సేవ‌లందిస్తున్నా.. తాను అధ్య‌క్ష ప‌ద‌వికి అర్హుడిని కాదా? అని ఎమ్మెల్యే ప్ర‌శ్నించారు. మీడియాతో చిట్ చాట్ సంద‌ర్భంగా ర‌ఘునంద‌న్ రావు బీజేపీకి అల్టిమేటం జారీ చేశారు. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు..త‌న‌కు స‌రైన గుర్తింపు ఇవ్వాల‌ని, మూడు ప‌ద‌వుల్లో ఏదో ఒక ప‌ద‌వి ఇవ్వాల‌ని ర‌ఘునంద‌న్ రావు డిమాండ్ చేశారు. అధ్య‌క్ష ప‌ద‌వికి తాను అర్హుడిని కానా..? పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి, ఫ్లోర్ లీడ‌ర్‌లో ఏదో ఒక‌టి ప‌ద‌వి ఇవ్వాలి. జాతీయ అధికార ప్ర‌తినిధి ఇచ్చినా త‌న‌కు ఓకే అని చెప్పారు. గ‌త ప‌దేండ్ల నుంచి పార్టీ కోసం ప‌ని చేస్తున్నాన‌ని గుర్తు చేశారు. కొన్ని విష‌యాల్లో త‌న కుల‌మే త‌న‌కు శాపం కావొచ్చు అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
బండి సంజ‌య్‌ది స్వ‌యంకృతాప‌రాథం అని ఆయ‌న అన్నారు. సంజ‌య్ పుస్తెల‌మ్మి ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. అలాంటి సంజ‌య్ వంద కోట్ల‌తో యాడ్స్ ఎలా ఇచ్చార‌ని ప్ర‌శ్నించారు. త‌రుణ్ చుగ్‌, సునీల్ బ‌న్స‌ల్ బొమ్మ‌ల‌తో ఓట్లు రావు అని చెప్పారు. ర‌ఘునంద‌న్, ఈట‌ల రాజేంద‌ర్ బొమ్మ‌ల‌తోనే ఓట్లు వ‌స్తాయ‌న్నారు. ఎన్నిక‌ల్లో పార్టీ గుర్తు చివ‌రి అంశ‌మే అని పేర్కొన్నారు. పార్టీకి శాస‌న‌సభాప‌క్ష నేత లేడ‌ని న‌డ్డాకు తెలియ‌దు. తాను గెలిచినందుకే ఈట‌ల పార్టీలోకి వ‌చ్చారు. ప‌దేండ్ల‌లో పార్టీ కోసం త‌న‌కంటే ఎక్కువ ఎవ‌రూ క‌ష్ట‌ప‌డలేదు. సేవ‌కు ప్ర‌తిఫ‌లం రాక‌పోతే న‌డ్డాపై మోదీకి ఫిర్యాదు చేస్తాన‌ని ర‌ఘునందన్ రావు పేర్కొన్నారు.