విభేదాలు పక్కన పెట్టి అభ్యర్థిని తప్పనిసరిగా గెలిపించాలి… రాహుల్ గాంధీ..

సిట్టింగ్ స్థానం చేయి జారనివ్వకండీ

నల్గొండ జిల్లా ముఖ్య నేతలతో రాహుల్ గాంధీ సమావేశం

మునుగోడు ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం చేయి జారకుండా నాయకులు కార్యకర్తలు అందరూ సమిష్టిగా కృషి చేయాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆదేశించారు.

మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో భారత్ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆదివారం నల్గొండ జిల్లా ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. బాలానగర్ మండలం పెద్దాయపల్లి గ్రామం వద్ద విరామ సమయంలో నల్గొండ జిల్లా ముఖ్య నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి, దామోదర్ రెడ్డి తదితరులతో సమావేశం అయ్యారు.

ఈసందర్భంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉప ఎన్నికల్లో పార్టీ పరిస్థితులను, ప్రత్యక్ష పార్టీల పరిస్థితులను గురించి రాహుల్‌కి వివరించారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల పట్ల ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవాలని, ఇటీవల జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలకు సంబంధించిన వ్యవహారాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని రాహుల్ గాంధీ సూచించారు.

విభేదాలు పక్కన పెట్టి అభ్యర్థిని తప్పనిసరిగా గెలిపించాలని నేతలను ఆదేశించినట్లు తెలిసింది.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహార శైలి కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సిట్టింగ్ స్థానం చే జారకుండా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని రాహుల్ గాంధీ నేతలను ఆదేశించినట్లు తెలిసింది.