ఉపాధి హామీ పథకం స్థానంలో ‘వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్’ను తీసుకొచ్చేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాన్ని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ తప్పుపట్టారు. ఈ మార్పు ద్వారా జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలను అవమానించేందుకు మోదీ సర్కారు యత్నిస్తోందని ఆయన విమర్శించారు. ఇప్పటికే దేశ యువతను నిరుద్యోగపు ఊబిలోకి నెట్టేసిన ప్రభుత్వం, ఇప్పుడు గ్రామీణ పేదల ఉపాధికి భరోసా లేకుండా చేయాలని కుట్ర పన్నిందని ఆరోపించారు. ఈమేరకు ‘ఎక్స్’ వేదికగా రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు..ప్రధానికి ఆ రెండు విషయాలంటే ద్వేషం
‘ప్రధాని మోదీ రెండు విషయాలను బాగా ద్వేషిస్తారు. మొదటిది మహాత్మాగాంధీ ఆదర్శాలు. రెండోది పేదల హక్కులు. గ్రామాల స్వయం పాలన అనే గాంధీజీ స్వప్నానికి ప్రతిరూపం ‘మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం’. దీనివల్ల దేశంలో లక్షలాది మంది గ్రామీణ పేదలు ఉపాధిని పొందుతున్నారు. కరోనా సంక్షోభ కాలంలోనూ ఎన్నో పేద కుటుంబాలకు ఈ పథకమే ఆర్థిక దన్నుగా నిలిచింది. వారికి కనీస ఆర్థిక భద్రతను కల్పించింది. గత పదేళ్లుగా ఈ గొప్ప పథకాన్ని తలచుకొని ప్రధాని మోదీ చిరాకు పడుతున్నారు. దాన్ని బలహీనపర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ పథకాన్ని పూర్తిగా తొలగించేందుకు మోదీ పూనుకున్నారు’ అని రాహుల్ గాంధీ విమర్శించారు.
రాష్ట్రాలపైకి ‘ఉపాధిహామీ’ ఖర్చుల భారం
‘ప్రజలకు ఉపాధి పొందే హక్కు, గ్రామాల స్వయం పాలన, ఉపాధి కూలీల వేతనాలను పూర్తిగా, పనుల మెటీరియల్ ఖర్చుల్లో 75 శాతాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందనే మూడు సూత్రాల ప్రాతిపదికన ఉపాధి హామీ పథకం అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ పథకం మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకునేలా మార్పులు చేయాలని మోదీ భావిస్తున్నారు. ఈ పథకం నిధులు, నిబంధనలు వంటివన్నీ కేంద్ర ప్రభుత్వమే డిసైడ్ చేయాలని అనుకుంటోంది. ఉపాధి హామీ పథకం ఖర్చుల్లో 40 శాతాన్ని రాష్ట్రాలపై మోపేందుకు యత్నిస్తున్నారు.’.