మరో మూడు రోజులు భారీ వర్షాలు..ఎల్లో అలెర్ట్‌ జారీ..!.

రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శనివారం ఉత్తర ఇంటీరియర్ ఒడిస్సా, పరిసర ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న ఆవర్తనం ఆదివారం ఆగ్నేయ మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతంలో సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఎత్తుకి వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపుకి వంపు తిరిగి ఉన్నది. ఉత్తర – దక్షిణ ద్రోణి బలహీనపడింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్తో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఆదివారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం, మంచిర్యాల, నిర్మల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మంగళవారం నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.