99,999 లోపు ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ..
రాష్ట్ర రైతాంగానికి మరో తీపికబురు…
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్న ఈ శుభసందర్భంలో రైతులను రుణ విముక్తి చేసే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరో దఫా రైతు రుణమాఫీకి సంబంధించిన నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన మాటను, ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రైతు రుణమాఫీ పథకాన్ని ఆచరణలో పెట్టారు. రూ.లక్ష లోపు రుణాలను తీసుకున్న రైతులను అప్పుల బాధ నుంచి విముక్తి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి,ఈమేరకు సోమవారం రోజున 99 వేల 999 రూపాయల వరకు బ్యాంకులకు రైతుల తరఫున బకాయిలను చెల్లించాలని నిర్ణయించారు.
దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఈరోజు ఆదేశాలు జారీచేశారు. రైతుల తరఫున బ్యాంకులకు డబ్బు మొత్తాన్ని తక్షణం జమ చేయాలని చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో సోమవారం 9 లక్షల 2 వేల 843 మంది రైతులకు సంబంధించి 5,809.78 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఇవి రైతుల ఖాతాల్లో రుణమాఫీ కింద బ్యాంకులకు చేరుతాయి.