రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబు.. !.

చద్రబాబుకు రాజమండ్రి జైలుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఏసీబీ కోర్టు వద్ద ఐదురకాల పోలీస్ ఫోర్సులను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో జైలుకు వెళ్తున్న తొలి మాజీ సీఎం చంద్రబాబే కావడం విశేషం.

ర్యాలీలు, నిరసనలకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు హెచ్చరించారు. తీర్పు తర్వాత చంద్రబాబు లాయర్లు రెండు పిటిషన్లు వేశారు. గృహ నిర్బంధానికి అనుమతి కోరుతూ ఓ పిటిషన్ వేశారు. జైలులో ప్రత్యేక సౌకర్యాలు ఉన్న గది కేటాయించాలని మరో పిటిషన్ వేశారు. అయితే చంద్రబాబు లాయర్లు చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. మరోవైపు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు రేపు సీఐడీ చంద్రబాబు కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. చంద్రబాబును స్కిల్ స్కాంలో మరింతగా ప్రశ్నించాలని సీఐడీ భావిస్తుంది.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్‌లో రూ.241 కోట్లు అవినీతి జరిగిందనే అభియోగాలతో.. ఏపీ సీఐడీ పోలీసులు శనివారం ఉదయం 6 గంటలకు చంద్రబాబు నాయుడిని నంద్యాలలో అరెస్టు చేశారు. ఈ కేసులో సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కింద చంద్రబాబును అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ఉన్నారు. చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్‌ 34 and 37 ఐపీసీ సెక్షన్‌ల కింద కేసు నమోదైంది.