రజినీకాంత్ సినిమాలో జీవిత రాజశేఖర్…!!..

రజినీకాంత్ కూతురు ఐశ్వర్య ఇప్పుడు ‘లాల్ సలాం’ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రజినీకాంత్ కూడా ఒక ముఖ్యమయిన పాత్ర వేస్తున్నారని కూడా తెలిసిందే. విష్ణు విశాల్, విక్రాంత్ ఈ ఇద్దరూ ఇందులో కథానాయకులుగా నటిస్తున్నారు, గత సంవత్సరం ఈ సినిమా చెన్నై లో అట్టహాసంగా ప్రారంభం అయింది. ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది.

అయితే ఇప్పుడు తాజా తెలిసిన వార్త ఏంటి అంటే, ఈ సినిమాలో జీవిత రాజశేఖర్ ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. ఐశ్వర్య ఎప్పటి నుంచో జీవిత రాజశేఖర్ కి ఈ పాత్ర గురించి చెప్పి, జీవిత మాత్రమే ఈ పాత్రకి కరెక్ట్ అని భావించి, ఆమెని కలిసి కథ చెప్పి, ఒప్పించిందని తెలిసింది. ఇందులో జీవిత, రజినీకాంత్ కి చెల్లెలు గా నటిస్తోందని భోగట్టా. జీవిత మార్చి మొదటి వారంలో చెన్నై వెళ్లి అక్కడి నుండి షూటింగ్ లో పాల్గొనవచ్చు అని కూడా తెలిసింది.

చాలా కాలం తరువాత జీవిత రాజశేఖర్ ఒక సినిమాలో నటిస్తున్నారు. ఆమె వివాహం అయ్యాక, ఎక్కువగా దర్శకురాలిగా, నిర్మాతగా ఫోకస్ పెట్టారు కానీ, నటన మీద అంత దృష్టి పెట్టలేదు. కానీ ఇప్పుడు చాలా సంవత్సరాల తరువాత ఆమె మళ్ళీ కెమెరా ముందుకు వస్తుండటం విశేషం. అది కూడా ఒక తమిళ సినిమాలో, రజినీకాంత్ నటిస్తున్న సినిమాలో.

‘లాల్ సలాం’ అనేది ఒక భారీ ప్రాజెక్ట్, దీన్ని పెద్ద సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఐశ్వర్య కి ఇది దర్శకురాలిగా మూడో సినిమా. దీనికి ఏ.ఆర్. రహమాన్ సంగీతం అందిస్తున్నారు..