రామగుండం ఎరువుల పరిశ్రమలో ట్రయల్ రన్.

రామగుండం ఎరువుల పరిశ్రమలో ట్రయల్ రన్.

రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్‌ఎఫ్‌సిఎల్)లో శనివారం అర్ధరాత్రి దాటాక 2.30 గంటలకు అధికారులు ట్రయల్న్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంస్థ సిఇఒ నిర్లప్ సింగ్ రాయ్ హాజరయ్యారు. రూ.6,180 కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ప్రాజెక్టును పునరుద్ధరిస్తున్నాయన్నారు. దీంతో రెండు దశాబ్దాల క్రితం మూత పడిన ఆర్‌ఎఫ్‌సిఎల్‌కు మళ్లీ పునర్‌వైభవం రానుంది. ఈ పరిశ్రమలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేపనూనె పూత పూసిన యూరియాను ఉత్పత్తి చేయనున్నారు. రామగుండం నుంచి దక్షిణాది రాష్ట్రాలకు యూరియా సరఫరా కానుందన్నారు. కాగా వాణిజ్య ఉత్పత్తి మార్చిలో ప్రారంభిస్తామని సిఇఒ నిర్లప్ సింగ్ రాయ్ ప్రకటించారు. ప్లాంట్ పూర్తిస్థాయి పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ ట్రయల్న్ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.
ఏటా 13 లక్షల టన్నుల ఎరువులు ఉత్పత్తి చేయలనేది ఈ పరిశ్రమ లక్ష్యమన్నారు. దేశంలో ఏటా 300 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను వినియోగిస్తుండగా 240 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోందన్నారు. మిగిలిన 60 లక్షల మెట్రిక్ టన్నులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందన్నారు. ఈ ఆర్థిక భారాన్ని తగ్గించడంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా మూతపడిన ఐదు కర్మాగారాలను పునరుద్ధరించాలని నిర్ణయించిందన్నారు. ఇందులో మొదటిగా తెలంగాణలో ఆర్‌ఎఫ్‌సిఎల్ సిద్ధమైందన్నారు. ఇప్పటికే ఈ కర్మాగారాన్ని ప్రారంభించాల్సి ఉండగా, కరోనా నేపథ్యంలో రాజస్థాన్, ఒడిశాలకు చెందిన వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లి తిరిగి రాకపోవడంతో పనులు చివరి దశలో నిలిచిపోయాయన్నారు. పనిచేయడానికి కార్మికులు మళ్లీ రావడంతో కర్మాగార నిర్మాణపనులను దాదాపు పూర్తి అయ్యాయని ఆయన పేర్కొన్నారు.