రష్యా న్యూక్లియర్‌ బలగాలు అప్రమత్తంగా ఉండాలన్న పుతిన్‌ ఆదేశాలు..అణుయుద్ధ కాంక్షతో రగులుతున్న పుతిన్‌: అమెరికా ఫైర్‌…

ఉక్రెయిన్‌తో శాంతి చర్చల కోసం తమ అధికారులు బెలారస్‌ వెళ్లారని ప్రకటించిన పుతిన్‌.. ఆ వెంటనే అందుకు పూర్తి విరుద్ధమైన, సంచలన ప్రకటన చేశారు. రష్యా అణ్వాయుధ బలగాలు అప్రమత్తంగా ఉండాలని, ఆయుధాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. నాటో దేశాలు తమపై ఆంక్షలతో కవ్వింపులకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. పుతిన్‌ తాజా ఆదేశంపై నాటో దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇది ప్రపంచదేశాలను రెచ్చగొట్టేలా ఉన్నదని ధ్వజమెత్తాయి. రష్యా అణు యుద్ధాన్ని కోరుకొంటున్నదని అమెరికా మండిపడింది. మరోవైపు, రష్యా బలగాలతో నాలుగో రోజు కూడా ఉక్రెయిన్‌ సైన్యం హోరాహోరీగా తలపడింది. ఆదివారం మధ్యాహ్నం రష్యా బలగాలు ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖార్కీవ్‌ను హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నించాయి. అయితే, ఉక్రెయిన్‌ సైన్యం వీరోచిత పోరాటంతో వారి ప్రయత్నం విఫలమైంది…ఉక్రెయిన్‌ ఆక్రమణకు రష్యా మొదలుపెట్టిన యుద్ధ క్రీడ కొత్త మలుపు తీసుకోనున్నదా.. మరో అణు యుద్ధం వైపు అడుగులు పడుతున్నాయా.. రష్యా న్యూక్లియర్‌ బలగాలు అప్రమత్తంగా ఉండాలన్న పుతిన్‌ ఆదేశాలు దీనికి సంకేతాలేనా..? శాంతి చర్చల కోసం తమ అధికారులు బెలారస్‌ వెళ్లారని ప్రకటించిన పుతిన్‌.. ఆ వెంటనే అందుకు పూర్తి విరుద్ధమైన, సంచలన ప్రకటన చేశారు. రష్యా అణ్వాయుధ బలగాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆయుధాలను సిద్ధం చేయాలని ఆర్డర్‌ వేశారు. పుతిన్‌ ఆదేశాలపై పశ్చిమ దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ‘పుతిన్‌ ప్రకటన ప్రపంచదేశాలను రెచ్చగొట్టేలా ఉంది’ అని నాటో సభ్యత్వ దేశాలు వ్యాఖ్యానించాయి. ‘యుద్ధాన్ని తీవ్రతరం చేస్తానని పుతిన్‌ చెప్పకనే చెప్తున్నారు. ఆయన అణు యుద్ధాన్ని కోరుకొంటున్నట్టు ఉంది’ అని అమెరికా పేర్కొన్నది. పుతిన్‌ ఆదివారం రాత్రి రక్షణ మంత్రి, చీఫ్‌ ఆఫ్‌ మిలిటరీస్‌ జనరల్‌ స్టాఫ్‌, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ‘పశ్చిమ దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలను విధిస్తున్నాయి. నాటో ఉన్నతాధికారులు మనపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. కవ్విస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. అనంతరం న్యూక్లియర్‌ బలగాలను అప్రమత్తం చేశారు…