భారత రక్షణ రంగం బలోపేతం..ఏరో ఇండియా ముగింపు కార్యక్రమాల్లో రాష్ట్రపతి.

*భారత రక్షణ రంగం బలోపేతం..ఏరో ఇండియా ముగింపు కార్యక్రమాల్లో రాష్ట్రపతి
..
కరోనా కారణంగా సవాళ్లు ఎదుర్కొంటున్నా ఏరో ఇండియా వంటి పెద్ద కార్యక్రమాన్ని భారత్‌ విజయవంతంగా నిర్వహించడం గర్వకారణమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. శుక్రవారం ఏరో ఇండియా కార్యక్రమం ముగింపు సందర్భంగా రాష్ట్రపతి పాల్గొని ప్రసంగించారు. 13వ ఏరోఇండియా కార్యక్రమం భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేయడమే కాక భారత్‌ ఉత్పత్తి సామర్థ్యాలను చాటి చెప్పిందన్నారు. ఈ కార్యక్రమంలో 43 దేశాల ప్రతినిధులు, 530 సంస్థలు పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచాయన్నారు. ఈ కార్యక్రమం మొత్తంలో 201 వ్యాపార ఒప్పందాలు జరిగాయని తెలిపారు. భారతవైమానిక దళం 48వేలకోట్లతో 83 తేజస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను తయారు చేసేందుకు హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. రక్షణ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యంతో ఎంతో అభివృద్ధిని సాధించామని రాష్ట్రపతి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భారత ఉత్పత్తులను సరఫరా చేసేందుకు ఆర్థికంగా బలపడటంతో పాటు మౌలిక సదుపాయాలు సమకూర్చుకుంటున్నామన్నారు.
ముందుగా చెప్పినట్లుగానే కరోనా సమయలో ఇతర దేశాలకు వ్యాక్సిన్లను అందిస్తూ భారత్‌ మాట నిలబెట్టుకుందని ఆయన తెలిపారు. పొరుగు దేశాలకు వైద్య సహాయాన్ని కూడా అందించామని తెలిపారు. వైమానిక దళ పర్యవేక్షణలో భారత గగనతలం సురక్షితంగా ఉందని తెలిపారు. ఎఫ్‌డీఐ సంస్కరణలతో గత ఐదేళ్లలో విదేశీ పెట్టుబడులు రక్షణ, వైమానిక రంగాల్లో 200శాతం పెరిగాయి. ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో డిఫెన్స్‌ కారిడార్స్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, రక్షణ శాఖ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ పాల్గొన్నారు.