ఈ నెల ఆరవ తేదీ నుంచి రాష్ట్రపతి భవన్‌కు సందర్శకులను అనుమతి….

ఈ నెల ఆరవ తేదీ నుంచి రాష్ట్రపతి భవన్‌కు సందర్శకులను అనుమతించనున్నారు. ప్రభుత్వ సెలవుదినాలు మినహా శని, ఆదివారాల్లో సందర్శకులను అనుమతిస్తారు. కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో గత ఏడాది మార్చి 13 నుంచి సందర్శకులను అనుమతించడం లేదు. కాగా, గత నెల 5 నుంచి రాష్ట్రపతి భవన్ మ్యూజియంను ప్రజల కోసం ప్రారంభించారు. సర్క్యూట్ 1 శని, ఆదివారాల్లో తెరుచుకుంటుంది. సర్క్యూట్ 2 సోమవారం మినహా అన్ని రోజులలో తెరుచుకుంటుందని రాష్ట్రపతి భవన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో సమాచారం ఉంచారు. సర్క్యూట్ 3 డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు గురు, శుక్ర, శని, ఆదివారాల్లో తెరుచుకుంటుంది. అయితే, ఉద్యానోత్సవ సమయంలో మూసివేస్తారు. సాధారణంగా, రాష్ట్రపతి భవన్‌లోని ప్రసిద్ధ మొఘల్ గార్డెన్, ఇతర ఉద్యానవనాలు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య జరిగే ఉద్యానోత్సవం సందర్భంగా ప్రజల సందర్శనం కోసం తెరుస్తారు. కాగా, దీన్ని ప్రతి సోమవారం మూసివేస్తారు. రాష్ట్రపతి భవన్‌ను వాస్తుశిల్పులు సర్ ఎడ్విన్ లుటియెన్స్, హెర్బర్ట్ బేకర్ సృష్టించారు. 330 ఎకరాల ఎస్టేట్‌లో 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించారు. ఇది తొలుత భారత వైస్రాయ్ నివాసంగా వాడటం వల్ల ఈ భవంతిని అప్పట్లో వైస్రాయ్ హౌస్ అని పిలిచేవారు. గత సంవత్సరం నవంబర్ 20 న జరిగిన ప్రపంచ పిల్లల దినోత్సవం సందర్భంగా.. పలు స్మారక చిహ్నాలతోపాటు రాష్ట్రపతి భవన్‌ కూడా పిల్లల హక్కులకు సంఘీభావం తెలుపుతూ అందంగా ముస్తాబైంది.