రుణ వసూళ్లలో బ్యాంకులు, రికవరీ ఏజెంట్లు అనుసరించాల్సిన నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. 2027, జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త నిబంధనల ప్రకారం, బ్యాంకులు ప్రత్యేక రికవరీ పాలసీని రూపొందించాలి. లోన్ బకాయి వసూలు ఎప్పుడు ప్రారంభించాలి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రుణగ్రహీతలతో ఎలా వ్యవహరించాలి, రికవరీ ఏజెన్సీలను ఎలా ఎంపిక చేయాలి, ఏజెంట్ల పనితీరును ఎలా పర్యవేక్షించాలి వంటి అంశాలను ఈ పాలసీలో స్పష్టంగా పేర్కొనాలి. నిబంధనలకు విరుద్ధమైన రికవరీ పద్ధతుల వల్ల రుణగ్రహీతకు నష్టం జరిగితే పరిహారం చెల్లించే విధానాన్ని కూడా బ్యాంకులు ఏర్పాటు చేయాలి. ఈ నిబంధనలు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకులు మినహా కమర్షియల్ బ్యాంకులకు వర్తిస్తాయి.
రికవరీ ఏజెంట్లపై కఠిన నిఘా
రికవరీ ఏజెన్సీలను నియమించే ముందు బ్యాంకులు వాటి నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఏజెంట్లను నియమించుకునే ముందు వారి నేపథ్యాన్ని తనిఖీ చేయడంతో పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (ఐఐబీఎఫ్) సర్టిఫికేట్ ఉన్న ఏజెంట్లకు మాత్రమే రికవరీ బాధ్యతలు అప్పగించాలి. తమ వద్ద ఉన్న రికవరీ ఏజెంట్ల జాబితాను బ్యాంకులు తమ వెబ్సైట్లో ప్రజలకు అందుబాటులో ఉంచడం తప్పనిసరి. రికవరీ ఏజెంట్ మొదటిసారి వ్యక్తిగతంగా కలవడానికి వెళ్లే ముందు కనీసం ఒక రోజు ముందే రుణగ్రహీతకు సమాచారం ఇవ్వాలి. ఏజెన్సీ మారినా లేదా సేవలు నిలిపివేసినా కూడా రుణగ్రహీతకు తెలియజేయాలి. ఏజెంట్లు గుర్తింపు కార్డు, అధికార పత్రాలు చూపిస్తూ, సాధారణంగా ఉదయం 8 నుంచి సాయంత్రం 7 గంటల మధ్యే రుణగ్రహీతలను కలవాలి. ఇంట్లో ఎవరైనా చనిపోయినా, వైద్య అత్యవసర పరిస్థితులు ఉన్నా వారిని సంప్రదించకూడదు.