బాలికపై 10మంది లైంగిక దాడి…!

విశాఖలో దారుణం జరిగింది. దళిత బాలికపై లైంగిక దాడి జరిగింది. 10మంది లైంగిక దాడికి పాల్పడ్డారు. మానవ మృగాల చేతిలో ఆ బాలిక నరకం అనుభవించింది…పొరుగు రాష్ట్రం ఒడిశా నుంచి పని కోసం వచ్చిన బాలిక జీవితాన్ని కొందరు దుర్మార్గులు చిదిమేశారు. వదిలేయండి అని వేడుకున్నా, కాళ్లా వేళ్లా పడినా ఆ నరరూప రాక్షసులు కనికరించలేదు.

15ఏళ్ల బాలికను ఓ యువకుడు ప్రేమ పేరుతో వంచించాడు. తన కామవాంఛను తీర్చుకున్నాడు. తన మిత్రుడిని కూడా ఉసిగొల్పాడు. పుట్టెడు దుఖంతో కుంగిపోతున్న ఆ బాలికపై మరో 8మంది కన్ను పడింది. రెండు రోజుల పాటు ఓ గదిలో నిర్బంధించి చిత్ర హింసలకు గురి చేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణం విశాఖ నగర వాసులను ఉలిక్కిపడేలా చేసింది.

ఒడిశాకు చెందిన ఓ కుటుంబం విశాఖ కంచరపాలెంలో నివసిస్తోంది. బాలిక ఓ నేవీ ఆఫీసర్ ఇంట్లో సహాయకురాలిగా పని చేసింది. బాలికకు భువనేశ్వర్ కు చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. డిసెంబర్ 18న బాలికను ప్రియుడు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. ఆ తర్వాత తన స్నేహితుడిని పిలిపించాడు. ఆ నీచుడు కూడా బాలికపై లైంగిక దాడి చేశాడు.ప్రియుడే ఇలా మోసం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక చనిపోవాలని నిర్ణయించింది. దిక్కుతోచని స్థితిలో ఆర్కే బీచ్ లో రోదిస్తోంది. అక్కడ పని చేస్తున్న కొంతమంది ఫోటోగ్రాఫర్లలో ఒక వ్యక్తి బాలికను గమనించాడు. ఆమెను ఓదారుస్తున్నట్లు నటించాడు. సాయం చేస్తానని, న్యాయం జరిగేలా చూస్తానని నమ్మించి బాలికను తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి బంధించాడు. ఆ తర్వాత బాలికపై లైంగిక దాడి చేశాడు. ఆ తర్వాత అతడితో పాటు 8మంది బాలికపై లైంగిక దాడికి దిగారు. రెండు రోజుల పాటు గదిలో నిర్బంధించి టార్చర్ పెట్టారు. ఆ నీచుల చెర నుంచి ఎలాగో విడిపించుకున్న బాలిక.. ఒడిశా రాష్ట్రం కలహండి జిల్లాలోని స్వగ్రామానికి వెళ్లిపోయింది.

కూతురు కనిపించకపోవడంతో కంగారుపడిన బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. బాలిక మిస్సింగ్ పై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. బాలిక ఒడిశాలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడి నుంచి తిరిగి విశాఖలోని ఇంటికి డిసెంబర్ 22న తీసుకొచ్చారు. జరిగిన దారుణంతో బాలిక షాక్ లోకి వెళ్లిపోయింది. బాగా భయపడిపోయింది. తీవ్రమైన మానసిక ఆందోళనకు గురైంది. తనకు జరిగిన అన్యాయం గురించి నిన్నటివరకు తల్లిదండ్రులతో చెప్పుకోలేకపోయింది.

అయితే ఏం జరిగింది? ఎక్కడికి వెళ్లావు? అని పోలీసులు పదే పదే అడగటంతో చివరికి తనకు జరిగిన అన్యాయం గురించి బాలిక తన తల్లిదండ్రులు, పోలీసులకు వివరించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు సహా పోలీసులు షాక్ కి గురయ్యారు. అసలు ఈ ఘటన నిజంగా జరిగిందా? లేదా? అనే కోణంలో పోలీసులు విచారించారు. బాలికపై లైంగిక దాడి జరిగినట్లు పోలీసులు తమ విచారణలో నిర్ధారించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు…
బాలిక తన ప్రియుడితో పాటు వెళ్లిన లాడ్జిలోనూ పోలీసులు తనిఖీలు చేశారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. అక్కడికి ఎవరెవరు వచ్చారు? ఏ సమయంలో వచ్చారు? అన్నది తెలుసుకున్నారు. ఫుటేజీ ఆధారంగా ప్రియుడు, అతడి స్నేహితుడిని పోలీసులు గుర్తించారు. మరోవైపు బీచ్ రోడ్ లోనూ సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. దాదాపుగా 8మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఇప్పటివరకు 10మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు పరారీలో ఉన్న బాలిక ప్రియుడు, అతడి స్నేహితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలు రంగంలోకి దించారు. జార్ఖండ్, ఒడిశాతో పాటు పలు ప్రాంతాల్లో వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వారిని విచారించి అసలు విషయాలు వెలుగులోకి తీసుకురావాలని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన తర్వాత నిందితులు లైంగిక దాడికి పాల్పడ్డారో లేదో నిర్ధారించాక 4 నెలల వ్యవధిలోనే బాలికకు న్యాయం జరిగేలా చేస్తామని పోలీసులు ప్రకటించారు.

విశాఖ లైంగిక దాడి ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్.. సమగ్ర విచారణకు ఆదేశించింది. ఘటన పూర్తి వివరాలు తెలియజేయాలని విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ కు లేఖ రాశారు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ. ఈ కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలన్నారు. బాధిత బాలిక వివరాలను గోప్యంగా ఉంచాలని.. అలాగే వైద్య సదుపాయం, రక్షణ కల్పించాలని వాసిరెడ్డి పద్మ చెప్పారు…