కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం..మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కేంద్ర కేబినెట్ ఆమోదం..!!

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాజ్యసభ 2010లో ఆమోదం పొందిన ఈ బిల్లును లోక్‌సభ కూడా ఆమోదిస్తే, మహిళా సాధికారత దిశగా అడుగులు పడింది..

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు(Women Reservation Bill) కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఈ రేపటి నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. దాదాపు అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు పలుకుతున్న నేపథ్యంలో.. ఈ బిల్లు పెద్దగా ఇబ్బందులు లేకుండానే పార్లమెంట్ మద్దతు పొందే అవకాశం ఉంది. ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదించాలని ప్రతిపక్ష పార్టీలు అఖిలపక్ష సమావేశంలో డిమాండ్ చేశాయి. ఆదివారం పార్లమెంట్‌లోని లైబ్రరీ భవన్‌లో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టాలని మెజార్టీ రాజకీయ పార్టీలు బలంగా లేవనెత్తాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లును ప్రవేశపెట్టాలని, ఏకాభిప్రాయంతో ఆమోదం పొందేలా చూడాలని వివిధ పార్టీల నేతలు కోరారు.

పురుషుల ఆధిపత్యం ఎక్కువ కావడం, మహిళల ప్రాధాన్యత తగ్గుతూ ఉండటంతో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రాధాన్యత పెరిగింది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లోని మొత్తం సీట్లలో 33శాతం లేదా మూడింట ఒక వంతు మహిళలకు రిజర్వ్ చేయాలని మహిళా రిజర్వేషన్ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. 33శాతం కోటాలో ఎస్సీ, ఎస్టీలు, ఆంగ్లో-ఇండియన్ల సబ్ రిజర్వేషన్లను కూడా బిల్లు ప్రతిపాదిస్తుంది. ప్రతి సార్వత్రిక ఎన్నికల తర్వాత రిజర్వ్‌డ్ సీట్లను మార్చాలని బిల్లు ప్రతిపాదిస్తోంది.