3కోట్ల రేషన్‌ కార్డుల రద్దు.. తీవ్రమైన అంశం.

3కోట్ల రేషన్‌ కార్డుల రద్దు.. తీవ్రమైన అంశం..కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు..

ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేయలేదని దాదాపు మూడు కోట్ల రేషన్‌ కార్డులను రద్దు చేయడం తీవ్రమైన విషయమని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దీనిపై తమ స్పందన తెలియజేయాలని కేంద్రం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు బుధవారం నోటీసులు జారీ చేసింది.
ఝార్ఖండ్‌కు చెందిన కొయిలీ దేవీ అనే మహిళ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆధార్‌ అనుసంధానం లేని కారణంగా కేంద్రం మూడు కోట్ల రేషన్‌ కార్డులను రద్దు చేసిందని, దీని వల్ల ఆకలి చావులు నెలకొన్నాయని పిటిషనర్‌ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది కొలిన్‌ అన్నారు. అయితే ఈ వాదనను అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అమన్‌ లేఖీ తోసిపుచ్చారు. రేషన్‌ కార్డులు రద్దు చేశామన్న ప్రకటన తప్పని అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న సీజేఐ జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ పిటిషన్‌పై విస్తృతంగా విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ‘ఆధార్ సమస్యలపై మీ స్పందన తెలియజేయమని అడుగుతున్నాం. ఇది సాధారణ వ్యాజ్యం కాదు. తీవ్రమైన విషయం. దీనిపై మేం తుది విచారణ చేపడుతాం’ అని సుప్రీంకోర్టు తెలిపింది. దీనిపై కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు జారీచేసిన న్యాయస్థానం.. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఝార్ఖండ్‌కు చెందిన కొయిలీ దేవీ 11ఏళ్ల కుమార్తె సంతోషి 2018లో ఆకలితో అలమటించి ప్రాణాలు కోల్పోయింది. తమ రేషన్‌ కార్డుకు ఆధార్‌ అనుసంధానం లేకపోవడంతో 2017 మార్చి నుంచి స్థానిక అధికారులు తమకు రేషన్‌ నిలిపివేశారని సంతోషి కుటుంబసభ్యులు అప్పట్లో ఆరోపించారు. పేద కుటుంబమైన తమకు రేషన్‌ రాకపోవడంతో తినడానికి తిండి కూడా దొరకలేదని, దీంతో తమ కుమార్తె చనిపోయిందని కొయిలీ వాపోయింది. దీనిపై 2018లోనే ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం.. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అయితే ఆధార్‌ కారణంగా ఎవరికీ రేషన్‌ నిలిపివేయాలేదని ప్రభుత్వం అప్పుడు సమాధానమిచ్చింది…..