భారీగా పెరుగుతున్న బియ్యం ధరలు..!

నెలలో క్వింటా బస్తా ధర ఇంత పెరిగిందా..!

దేశంలో బియ్యం ధరలు భారీగా పెరిగాయి. HMT, BPT, సోనామసూరి ధరలు క్వింటాల్‌పై రూ.1000 నుంచి రూ.1500 వరకు పెరిగాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో సంభవించిన వరదలతో పంటనష్టం, వరిసాగు తగ్గడమే బియ్యం రేట్లు పెంపునకు కారణంగా తెలుస్తోంది…
బియ్యం ధరలు పెరుగుతుండడం కలవరపెడుతున్నది. నిన్నమొన్నటి వరకు కిలో బియ్యం రూ. 45 నుంచి రూ.50 మధ్య లభించగా ఇప్పుడా ధర ఏకంగా రూ. 60కి పెరిగింది. కొంచెం మంచి రకాలైతే రూ. 70 వరకు చెల్లించుకోవాల్సి వస్తున్నది. ప్రజలు ఎక్కువగా వినియోగించే సన్న రకాలైన బీపీటీ, హెచ్‌ఎంటీ, సోనామసూరి ధరలు సగటున క్వింటాలుకు రూ.1000 నుంచి రూ. 1500 వరకు పెరిగాయి. నిరుడు క్వింటాలు రూ. 4,500 నుంచి రూ. 5 వేల మధ్య లభించగా ఇప్పుడు ఏకంగా రూ. 6,200 వరకు పెరిగింది. ఇందులో పాతబియ్యం అయితే రూ.7,500 వరకు పలుకుతున్నది. హెచ్‌ఎంటీ, బీపీటీ కొత్త రకం బియ్యం ధర గతంలో క్వింటాలుకు రూ. 3,300 నుంచి రూ. 3,500 వరకు ఉండగా ఇప్పుడది రూ. 4,500కు చేరింది. మొత్తంగా బియ్యం ధరలు సగటున రూ. 1000 పెరిగాయి…బియ్యానికి ప్రస్తుతం ఉన్న డిమాండ్‌ను మిల్లర్లు సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. హైదరాబాద్‌లో సాధారణ రకం బియ్యం 25 కిలోల బస్తా ధర రూ. 180 నుంచి రూ. 250 చొప్పున పెరిగింది. ఈ లెక్కన గతంలో రూ.1200 ఉన్న 25 కిలోల బస్తా ధర ప్రస్తుతం రూ. 1,350 వరకు ఉంది. ఫైన్‌ క్వాలిటీ బియ్యమైతే రూ. 1,650-1,800 మధ్య పలుకుతున్నది. ఇదే పరిస్థితి కొనసాగితే మున్ముందు ధరలు మరింత పెరగక తప్పని పరిస్థితి నెలకొంటుందని వ్యాపారులు చెప్తున్నారు.