హుస్నాబాద్ జాతీయ రహదారిపై నాలుగు పల్టీలు కొట్టిన కారు…

*

హుస్నాబాద్‌ పట్టణంలో పండగ పూట విషాదం నెలకొంది.

హుస్నాబాద్‌ పట్టణ శివారులోని కరీంనగర్‌వెళ్లే రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణం లోని శివాజీనగర్‌కు చెందిన ఎగ్గోజు యశ్వంత్‌(17)అనే వ్యక్తి మృత్యువాత పడ్డాడు. మరో ముగ్గురు తీవ్ర గాయాలై ప్రాణాలతో బయటపడ్డారు.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హుస్నాబాద్‌ పట్టణానికి చెందిన ఎగ్గోజు యశ్వంత్‌ తన స్నేహితులు నారోజు వెంకటేశ్‌, ఎగ్గోజు అఖిల్‌, కేమసారం అజయ్‌ లతో కలిసి వ్యాగనార్‌ కారులో చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా ముందు గా వెళ్తున్న ఆర్టీసీ బస్సును అతివేగంతో ఓవర్‌టేక్‌ చేయబోయి అదుపు తప్పారు.

దీంతో కారు సుమారు నాలుగుసార్లు పల్టీలు కొట్టి నుజ్జు నుజ్జయింది. క్షతగాత్రులను 108లో స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించగా యశ్వంత్‌ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

మరో ముగ్గురు యువకులు చికిత్స పొందుతున్నారు. కారులో ఉన్న నలుగురు కూడా మైనర్లే కావడం విశేషం. వీరందరూ ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్నారు. భోగీ పండుగ పూట యశ్వంత్‌ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

కుటుంబ సభ్యులు, బంధువుల రోధనలు మిన్నంటాయి. ఎస్‌ఐ తోట మహేశ్‌ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…