గర్భగుడి తలుపులు తెరిచి అమ్మవారిని చూశాడు. అంతే ఇక ఒక్క కూడా ముందుకు వేయలేదు…

ఓ దొంగ దొంగతనానికి వచ్చి కాసేపు ఆలోచించి సైలెంట్‌గా వెళ్లిపోయాడు. జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణ శివారులోని 63వ జాతీయ రహదారి పక్కన వట్టివాగు సమీపంలో శ్రీమహాలక్ష్మి అమ్మవారి దేవాలయం ఉంది. ఆ గుడికి భక్తుల తాకిడీ తక్కువ. పైగా చుట్టు పక్కన జనసంచారం కూడా పెద్దగా ఉండదు. దాంతో ఆ గుడినే టార్గెట్‌గా చేసుకున్న ఓ దొంగ.. అర్థరాత్రి ఆలయంలోకి చొరబడ్డాడు. ఆలయ తలుపులకు ఉన్న తాళాలను తొలగించి ప్రధానాలయంలోకి వెళ్లాడు. అంతసేపూ ధైర్యంగా, దొంగతనమే లక్ష్యంగా గుడిలోకి ఎంటరైన దొంగ.. గర్భగుడి తలుపులు తెరిచి అమ్మవారిని చూశాడు. అంతే ఇక ఒక్క కూడా ముందుకు వేయలేదు…అమ్మవారి ఆభరణాలు చోరీ చేయడం తప్పుగా భావించాడో, మరే కారణమో తెలియదు కానీ.. దొంగతనం చేయాలనుకునే తన ఆలోచనను విరమించుకుని ఆలయం లోపలికి ఎలా వచ్చాడో అలాగే వెనుదిరిగి వెళ్లిపోయాడు. అమ్మవారి ఆభరణాలు సహా, గుడిలోని ఒక్క సామాగ్రిని కూడా అతను టచ్ చేయలేదు. అయితే, రోజూలాగే అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆలయానికి పూజారులు రాగా.. ఆలయ తలుపులు పగులగొట్టి ఉన్నాయి. వెంటనే అనుమానం వచ్చి సీసీ కెమెరాలను పరిశీలించగా.. దొంగ ఆలయంలోకి ప్రవేశించడాన్ని గుర్తించారు. విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో వారు ఆలయానికి చేరుకుని సీసీ ఫుటేజీని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. కాగా, నిందితుడు దోపిడీకి పాల్పడకపోవడానికి కారణం అమ్మవారే అని స్థానికులు అనుకుంటున్నారు.