Rs 2000 Notes:
*Bank Notes | దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ RBI) కీలక ప్రకటన చేసింది. రూ.2 వేల నోట్లకు సంబంధించి ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది.*
రూ.2 వేల నోట్ల ఉపసంహరణ ప్రకటన నుంచి చూస్తే.. ఇప్పటి వరకే దాదాపు 88 శాతం రూ.2వేల నోట్లు బ్యాంకులకు (Banks) తిరిగి వచ్చేశాయని ఆర్‌బీఐ వెల్లడించింది. ఆర్‌బీఐ మే 19న రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది. ఇప్పుడు జూలై 31 నాటికి చూస్తే.. దాదాపు రూ.3.14 ట్రిలియన్ రూ.2 వేల నోట్లు తిరిగి బ్యాంకులకు చేరాయి.
ఇంకా రూ. 42 వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు వ్యవస్థలో చెలామణిలో ఉన్నాయని ఆర్‌బీఐ తెలిపింది. బ్యాంకుల నుంచి తీసుకున్న డేటా ఆధారంగా ఆర్‌బీఐ ఈ విషయాన్ని వెల్లడించింది. బ్యాంకుల్లోకి వచ్చిన రూ. 2 వేల నోట్లను గమనిస్తే.. వీటిల్లో 87 శాతం డిపాజిట్ల రూపంలో వచ్చాయి. అలాగే 13 శాతం ఎక్స్చేంజ్ రూపంలో బ్యాంక్‌లకు చేరాయి. కాగా ఆర్‌బీఐ రూ.2 వేల నోట్ల ఎక్స్చేంజ్‌కు సెప్టెంబర్ చివరి వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. అంటే ఇంకో రెండు నెలల గడువు
ఉందని చెప్పుకోవచ్చు.
అందువల్ల మీ వద్ద రూ.2 వేల నోట్లు ఉంటే.. వాటిని ఎక్స్చేంజ్ చేసుకోవాలని భావిస్తే.. బ్యాంకులకు వెళ్లి ఈ పని పూర్తి చేసుకోవచ్చు. 2018 మార్చి నెలలో రూ.2 వేల నోట్లు వ్యవస్థలో చాలా ఎక్కువగా ఉన్నాయి రూ. 6.73 ట్రిలియన్లుగా ఉన్నాయి. అయితే 2023 మార్చి నాటికి రూ.2 వేల నోట్లు రూ. 3.62 ట్రిలియన్లకు తగ్గాయి. ఈ క్రమంలోనే ఆర్‌బీఐ కూడా రూ.2 వేల నోట్ల ఉపసంహరణను ప్రకటించింది. ఆర్‌బీఐ క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు రూ. 2 వేల నోట్ల చెలామణి పూర్తిగా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. వచ్చే 2 నెలల తర్వాత వ్యవస్థలో ఇక రూ. 2 వేల నోట్లు కనిపించకపోవచ్చు.
కాగా మరో వైపు ప్రభుత్వం రూ. 500 నోట్లను రద్దు చేస్తుందని, మళ్లీ రూ. 1000 నోట్లను తీసుకువస్తుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఈ అంశంపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. తిరిగి రూ.1000 నోట్లు తీసుకువచ్చే ఆలోచన లేదని తెలిపింది. అంతేకాకుండా రూ. 500 ట్లును రద్దు చేసే ప్రతిపాదన ఏమీ లేదని వెల్లడించింది. అందువల్ల ఈ అంశంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదు.